కృష్ణ కృష్ణా ! : మ‌రో వివాదంలో జ‌గ‌న్ ?

-

రెండు ప్ర‌ధాన ప్రాజెక్టుల‌కు అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ఏం మాట్లాడ‌డం లేదు. రెండు ప్ర‌ధాన ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు ప‌న్నెండు వేల కోట్ల రూపాయ‌లు అవుతాయి. ఆధునికీక‌ర‌ణ‌తో క‌లిపి కేంద్రం చెబుతున్న లెక్క‌లివి. కానీ సంబంధిత ప్ర‌భుత్వాల‌కు ఇవేవీ ప‌ట్ట‌డం లేదు. త‌ప్ప‌ని సరైతే మాత్ర‌మే నిధులు ఇచ్చేందుకు ముందుకు వ‌స్తాయేమో కానీ ఇరు రాష్ట్రాలు త‌మ సాగు, తాగు, జ‌ల విద్యుత్ అవ‌స‌రాలు తీరుస్తున్న ప్ర‌ధాన ప్రాజెక్టులు అయిన శ్రీ‌శైలంను కానీ సాగ‌ర్ ను కానీ ప‌ట్టించుకోవ‌డం లేదు అన్న‌ది ఓ ప్ర‌ధాన విమ‌ర్శ వ‌స్తోంది.

ఏటా ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు 819 కోట్ల‌కు పైగా నిధులు కావాల్సి ఉంది అని బోర్డు లెక్క‌లు తేల్చినా వాటిని ప‌ట్టించుకునేందుకు ఇరు రాష్ట్రాలూ ఓ అంగీకారానికి వ‌చ్చి నిధులు ఇచ్చేందుకు అస్స‌లు సుముఖ‌త వ్య‌క్తం చేయ‌డం లేదు. శ్రీ‌శైలం ప్రాజెక్టులో ప్ర‌స్తుతం చేప‌ట్టిన ప‌నులు పూర్తికి ఏడు వంద‌ల కోట్ల రూపాయ‌లు అవ‌స‌రం అని కేంద్రం చెబుతుంది. నాగార్జున సాగ‌ర్ కు రెండు వంద‌ల కోట్లు అవ‌స‌రం అని కూడా గ‌ణాంకాలు చెబుతున్నాయి. మ‌రి ! వీటికి ఇవ్వాల్సిన నిధులు రెండు తెలుగు రాష్ట్రాలే భ‌రించాలి. కానీ అవి భ‌రించ‌డం లేదు అన్న‌ది ఇప్ప‌టి వాస్త‌వం.

మళ్లీ ఏపీని ఆర్థిక స‌మ‌స్య‌లు చుట్టు ముడుతున్నాయి. గ‌తం క‌న్నా భిన్నంగా ఇవి జ‌గ‌న్ స‌ర్కారును అటు తెలంగాణ స‌ర్కారును కూడా ఇర‌కాటంలో పెడుతున్నాయి. ప్ర‌ధాన సాగునీటి ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఇటు ఏపీ కానీ అటు తెలంగాణ కానీ అటు ఇటు కానీ వ్యూహాన్నే అనుస‌రిస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ హ‌క్కులు కేంద్రానికి ద‌ఖ‌లు ప‌రిచాక, సంబంధిత ప్ర‌ధాన జ‌ల వ‌న‌రుల వాడ‌కం, పంప‌కం, జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి వంటివి ప‌రిష్కృతం కావ‌డం లేదు. అస‌లు బోర్డు నిర్వ‌హ‌ణ‌కు చెల్లించాల్సిన నిధులే రెండు వంద‌ల కోట్లు. ఇది ఏపీ మాత్ర‌మే కాదు తెలంగాణ కూడా చెల్లించాలి. కానీ ఇవేవీ ఎక్క‌డా అమ‌లు కావ‌డం లేదు.

అందుకే తెలివిగా మ‌ధ్యేమార్గంగా ప్రాజెక్టుల వ్య‌వ‌హార‌మై తాము కూర్చొని మాట్లాడుకుంటామ‌ని కేంద్రానికి రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలూ చెబుతున్నాయి. అదే ఇప్పుడు ప్ర‌ధాన స‌మ‌స్య‌గా ఉంది. ప్రాజెక్టుల ప‌రిధి అన్న‌ది త‌మ ప‌రిధిలోకి వ‌చ్చాక మ‌ళ్లీ వాటి నిర్వ‌హ‌ణ విష‌య‌మై ఏపీ, తెలంగాణ మాట్లాడుకోవ‌డం ఏంటి అన్న‌ది ఓ పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ నేప‌థ్యంలో కృష్ణా న‌ది కి సంబంధించి ప్ర‌ధాన ప్రాజెక్టులుగా చెప్పుకునే శ్రీ‌శైలం కానీ సాగ‌ర్ ప్రాజెక్టు కానీ ఆధునికీక‌ర‌ణ‌కు కానీ లేదా క‌నీస మ‌ర‌మ్మ‌తులుకు కానీ నిధులు ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వ‌డం లేద‌ని సంబంధిత బోర్డు ఆవేద‌న చెందుతోంది. ఈ మేర‌కు ఇరు తెలుగు రాష్ట్రాల‌కూ లేఖలు రాసింది.

ఎప్ప‌టి నుంచో అప‌రిష్కృతంగా ఉన్న కొన్ని స‌మ‌స్య‌లు మ‌ళ్లీ మొద‌టికే వ‌చ్చాయి. ఉన్న‌వాటికే నిధులు ఇవ్వ‌లేని అవ‌స్థ‌ల్లో, సందిగ్ధ‌త‌లో ఉన్న ఏపీ స‌ర్కారుకు మ‌రో క‌ష్టం వెన్నాడుతోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ అన్న‌ది ఓ పెద్ద స‌వాలుగానే ప‌రిణ‌మిస్తోంది. గతం క‌న్నా ఇప్పుడు ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ అన్న‌ది కేంద్రం ప‌రిధిలోకి వెళ్లిపోవ‌డంతో కృష్ణా బోర్డు నిర్వ‌హ‌ణ అన్న‌ది రెండు రాష్ట్రాల‌కూ సంబంధించిన విష‌యంగా మారిపోయింది. దీంతో ప్రాజెక్టుల నిర్వ‌హ‌ణ‌కు రెండు తెలుగు రాష్ట్రాలూ నిధులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇరు రాష్ట్రాలూ ఆ విష‌య‌మై వెన‌క‌డుగు వేస్తున్నాయి. మ‌రి ! వీటిపై తెలుగు రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తాయో అన్న‌ది చూడాలిక !

Read more RELATED
Recommended to you

Latest news