అమెరికాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమెరికాలో ఉన్న తెలుగు వాళ్లకు ప్రత్యేక సూచనలు చేసారు. అక్కడి ప్రభుత్వం ఇస్తున్న సూచనలను పాటించడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఆయన వారికి సూచించారు. ఈ నేపధ్యంలోనే ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ఏపీ సీఎం జగన్ సందేశాన్ని ప్రదర్శించడం గమనార్హం.
నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల ఈ డిజిటల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేయడంతో అక్కడ ఉన్న వారు దీన్ని జాగ్రత్తగా విన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తమ కుటుంబసభ్యుల గురించి కలత చెందవద్దని, ఇక్కడ ప్రభుత్వం వారి పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని జగన్ స్పష్టం చేసారు. కోవిడ్ –19 నివారణ కోసం ప్రభుత్వ యంత్రాంగం కష్టపడి పనిచేస్తుందని అన్నారు.
ఎక్కడ ఏ చిన్న ఘటన వెలుగులోకొచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని ఆయన అన్నారు. సమగ్రవైద్య విధానంలో వారికి ఉత్తమమైన వైద్యం అందిస్తున్నామని జగన్ పేర్కొన్నారు. తమ వారి కోసం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆయన… అమెరికాలో ఉంటున్న తెలుగువారంతా కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని, తమ ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని జగన్ సూచించారు.