జిల్లాలను విభజించి పాలనలో వేగం పెంచాలని జగన్ భావిస్తున్నారు.ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు అన్నది సాధ్యం కావాలని, నాటి నుంచే కొత్త కార్యాలయాల్లో పనులు కూడా ఆరంభం కావాలని జగన్ సంకల్పిస్తున్నారు.ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి కొంత మేరకు నిధులు కూడా విడుదల చేసి జగన్ తన కలను నెరవేర్చుకోవాలని చూస్తున్నారు. చాలీ చాలని నిధులతో తామేం పనిచేయగలమని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
దీంతో ఇరు వర్గాలకూ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాటిని పరిష్కరించాలంటే నిధులు సజావుగా సరిపడినంత రీతిలో విడుదల చేయడం ఒక్కటే మార్గం.కానీ జగన్ దగ్గర డబ్బులు లేవు. ఉన్న డబ్బులు చేసిన అప్పులు అన్నీ కూడా సంక్షేమానికే సర్దుతున్నారు. అభివృద్ధి ఊసే లేనప్పుడు డబ్బులు అన్నీ సంక్షేమానికే వెచ్చింపు చేస్తున్నప్పుడు ఆశించిన రీతిలో పనులు ఏ విధంగా సాగుతాయి అన్నది ఓ అపరిష్కృత ప్రశ్న.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను నిలుపుదల చేయాలని సంబంధిత గెజిట్ ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఇవాళ విచారణ జరగనుంది.అశాస్త్రీయ విభజనకు సంబంధించి కోర్టు జోక్యం చేసుకోవాలని కోరుతూ పిటిషనర్లు తమ వాదనను వినిపిస్తున్నారు. ముఖ్యంగా పోస్టులకు సంబంధించి కొత్త జోన్ల ఏర్పాటు ఇప్పటివరకూ ఉన్న నాలుగు జోన్లను పెంచేందుకు తీసుకునే చర్యలు అన్నింటిపై ప్రభుత్వం మాట్లాడాల్సి ఉంది.
కానీ ఏకపక్ష ధోరణిలో తామేం చేయాలనుకుంటున్నామో అన్నది వెల్లడి చేయక గోప్యత పాటించి అంతా మా ఇష్టం అని నడుచుకోవడం తగని పని అని జగన్ ను వ్యతిరేకిస్తున్న పిటిషనర్ల మాట. వీటిపైనే కోర్టులో వాద ప్రతివాదాలు జరగనున్నాయి ఇవాళ అంటే ఈ సోమవారం.కోర్టు ఏం అంటుందో అన్నది కొద్ది గంటల్లోనే తేలిపోనుంది.