పూసపాటి అశోక గజపతి రాజు… తెలుగు రాజకీయాల్లో ఆయనకు అంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయనకు ఆ పార్టీలో ముందు నుంచి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. విజయనగరంలో ఆయనకు బలమైన క్యాడర్ ఉంది. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది. దాదాపు 15 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలరు.
ఇక ఆయన రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా పార్టీలో కీలక నేతగా అనేక పదవులు నిర్వహించారు. ఇక ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా విపక్షాలు ఎప్పుడూ ఆయన నిర్వహించిన విమానయాన శాఖలో అవినీతి జరిగింది అని అనలేదు. ఇక రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ప్రత్యర్ధిగా ఉన్న బొత్సా సత్యనారాయణ, సహా ఇతర కాంగ్రెస్ వైసీపీ నాయకులు కూడా ఆయన అవినీతి చేసారు అని ఎప్పుడు అనలేదు.
కాని ఇప్పుడు అనూహ్యంగా అవినీతి ఆరోపణలతో ఆయనను మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా తప్పించడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన బ్రతికి ఉండగానే ట్రస్ట్ చైర్మన్ ని తప్పించడం కరెక్ట్ కాదని వైసీపీ సీనియర్ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ట్రస్ట్ పరిధిలో ఉన్న విలువైన భూముల మీద కన్నేయడానికే అనే విషయం ప్రజల్లోకి వెళ్తుంది అని వాళ్ళు అంటున్నారు.
ఉత్తరాంధ్రలో ఈ పరిణామం తప్పుడు సంకేతాలు ఇస్తుంది అంటున్నారు. అటు టీడీపీ కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉంది. వైసీపీ నాయకులు కూడా ఆయన మీద ఆరోపణలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. మంత్రులు కూడా ఒకరిద్దరు మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ విధానం సరైనది కాదని… అనవసరంగా ముఖ్యమంత్రి తప్పు చేసారని, అలాంటి నేత మీద ఇలాంటి ఆరోపణలు కరెక్ట్ కాదు అంటున్నారు.