వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మూడేళ్లు…!

ఏపీ రాజకీయాల్లో చారిత్రాత్మకంగా నిలిచిపోయిన వైఎస్‌ జగన్ ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించి మూడేళ్లు పూర్తయింది. కడప జిల్లా వైఎస్‌ఆర్‌ సమధి వద్ద జగన్‌ పాదయాత్రను మొదలుపెట్టారు. 14నెలలపాటు సుదీర్ఘంగా 13జిల్లాల్లో నడిచి ఇచ్చాపురంలో ముగించారు.

2017 నవంబర్‌ 6న ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద నుంచి జగన్‌ ప్రజా సంకల్పానికి శ్రీకారం చుట్టారు. 13 జిల్లాల్లో 6 నెలల పాటు ఈ యాత్ర సాగుతుందని పార్టీ వర్గాలు తొలుత అంచనా వేసినా, అది 14నెలల పాటు సాగింది. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో ఈ యాత్ర ముగిసింది.

మొత్తం 3వేల 648 కిలోమీటర్లు జగన్‌ నడిచారు. 13జిల్లాలు, 134నియోజకవర్గాలు, 231మండలాల పరిధిలోని 2వేల 516 గ్రామాలు, 62 నగరాలు, పట్టణాల్లో జగన్‌ పర్యటించారు. 124 భారీ బహిరంగ సభలు, 55 ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు.దాదాపు రెండు కోట్లమంది ప్రజలతో మమేకమయ్యారు. 2019 జనవరి 9న ఇచ్ఛాపురంలో పాదయాత్రను ముగిస్తూ పైలాన్‌ను ఆవిష్కరించారు.

ప్రజా సంకల్ప యాత్ర ముగిశాక వచ్చిన ఎన్నికల్లో 151 శాసనసభ, 22 లోక్‌సభా స్థానాల్లో విజయం సాధించారు. మే 30న వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.

జగన్ పాదయాత్రకు మూడేళ్లు అయిన నేపథ్యంలో పది రోజుల పాటు చైతన్య కార్యక్రమాలకు పిలుపు నిచ్చింది వైసీపీ. పాదయాత్రలో ఇచ్చిన హామీలను దాదాపు 90 శాతానికి పైగా నెరవేర్చమని ఈ పది రోజులు వాటిపై ప్రజలకి వివరించనున్నారు. ఈ పది రోజులు ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించి వారికి మరేమైనా సమస్యలు ఉన్నాయా అని ఈ కార్యక్రమాల ద్వారా తెలుసుకోబోతున్నారు.