ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తిని సవాల్గా తీసుకుంటున్న జగన్ సర్కార్.. కరోనా నియంత్రణపై కీలక ముందడుగు వేస్తుంది. తాజాగా కరోనా నియంత్రణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా చికిత్సలో భాగంగా ప్రైవేట్ ఆస్పత్రిలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో… ప్రైవేట్ ఆస్పత్రిలు వసూలు చేసే ఛార్జీలు అత్యవసర ఖరీదైన ఔషధాల వినియోగం పై పరిమితులు విధిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కారు.
ఐసీఎంఆర్ సూచించిన ఔషధాల పై ఉన్న ఎంఆర్పి ప్రకారమే వసూలు చేయాలని… అంతే కాకుండా ఆరోగ్యశ్రీ ట్రస్టు లో నమోదైన అన్ని ఆస్పత్రులు కూడా ఔషధ వినియోగానికి సంబంధించి పూర్తి ఆధారాలు ప్రభుత్వానికి సమర్పించాలి అంటూ స్పష్టం చేసింది. అవసరానికి మించి అత్యధిక డోసులు వినియోగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద నమోదైన ప్రైవేట్ ఆస్పత్రిలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే కరోనా చికిత్సకు డబ్బులు వసూలు చేయాలని.. అదే సమయంలో ఆరోగ్య శ్రీ పరిధిలోకి రాని ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా గతంలో ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ ప్రకారమే పేదలకు వైద్యం అందించాలని సూచించింది జగన్ సర్కార్.