మూడున్నర లక్షల మందికి పైగా ఒకేసారి రూ. 10 వేలు

అమరావతి: ఏపీ సీఎం జగన్ మరో అడుగు ముందుకు వేశారు. జగనన్న తోడు పథకం నిధుల విడుదలను ఆయన వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఏపీలో 3 లక్షల 70 మంది చిరు వ్యాపారులకు లబ్ధికలిగింది. వీరి ఖాతాల్లో రూ.10 వేల చొప్పున మొత్తం రూ.370 కోట్లను జగన్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ చిరువ్యాపారులకు మేలు చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. తాను పాదయాత్ర చేసినప్పుడు చిరు వ్యాపారుల కష్టాలు చూశానని, అందుకే వారి కోసం జగనన్న తోడు పథకం ద్వారా వడ్డీలేని రుణాలు అందజేస్తున్నామని చెప్పారు. గత ఏడాది తొలి విడతలో 5.35 లక్షల మందికి రుణ సౌకర్యం కలిగించామని ఆయన పేర్కొన్నారు. రెండో విడతలో 3.7 లక్షల మంది చిరువ్యాపారులకు రూ.370 కోట్ల రుణ సౌకర్యం అందించామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. మొత్తం 9 లక్షల 5 వేల మంది చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణం ఇచ్చినట్లు తెలిపారు.