పీసీసీ రాజకీయం: రేవంత్ ని టార్గెట్ చేసిన జగ్గారెడ్డి!

-

తెలంగాణ కాంగ్రెస్ లో… పార్టీని ఎలా బలోపేతం చేసుకుందాము.. పార్టీని ఎలా రక్షించుకుందాము.. పార్టీలో ఉన్న నలుగురైదుగురుమైనా ఎలా ఐకమత్యంగా ఉందాము.. మరింత ఐకమత్యంగా ప్రభుత్వంపై ఎలా పోరాడదాదు.. ఇంకాస్త ఐకమత్యంతో జనాల్లోకి ఎలా వెళ్దాము.. ప్రజల్లో మరింతగా నమ్మకాన్ని ఎలా పెంచుకుందాము.. అనే ఆలోచనలస్థానే… ఎవరు టీపీసీసీ అధ్యక్షుడు అవుదామనే విషయంపైనే అధిక శ్రద్ధ ఉందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ… ఒకపక్క కోమటి రెడ్డి వెంకట రెడ్డి, ఇంకోపక్క రేవంత్ రెడ్డి, మరోపక్క ఉత్తమ్‌ కుమార్ రెడ్డి… వీరంతా చాలదన్నట్లు తాజాగా జగ్గారెడ్డి!

అవును…తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం టీపీసీసీ కి సంబందించి ఇంటర్నల్ వార్ నడుస్తోంది. ఎవరి బలం ఎంత, ఎవరి మద్దతు ఎవరికి అనే లెక్కలు రోజు రోజుకీ బయటపెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జగ్గారెడ్డి మైకందుకున్నారు. పీసీసీ చీఫ్ రేసులో తానూ ఉన్నానని మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి… టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ ను మార్చాల్సిన అవసరమేలేదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీకు లేఖ రాస్తానని ప్రకటించిన జగ్గారెడ్డి… ఉత్తమ్‌ నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడుతున్నారు. ఇలా ఉత్తమ్‌ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్న జగ్గారెడ్డి… రేవంత్ పై మాత్రం విరుచుకుపడ్డారు!

ఎంపీ రేవంత్‌రెడ్డి పీసీసీ కోసం ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంపై అధిష్టానం తనను అడిగితే మాత్రం “రేవంత్ కు ఇవ్వొద్దు” అని చెబుతానని తెలిపారు! అయితే ఈ విషయంలో తన అభ్యంతరాలను మీడియాకు కాకుండా… నేరుగా రేవంత్‌ రెడ్డికే చెబుతానని స్పష్టం చేస్తున్నారు జగ్గారెడ్డి! అక్కడితో ఆగని ఆయన… రేవంత్‌ రెడ్డికి పీసీసీ ఇస్తే తన రాజకీయం తనకుందని.. ఉత్తమ్‌ పై రేవంత్‌రెడ్డి ఫేస్‌ బుక్‌ టైగర్లు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఫైరవుతున్నారు. ఏది ఏమైనా… ఈ పీసీసీ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో చినికి చినికి గాలివానగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news