హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితం అధికార టీఆర్ఎస్ పార్టీ కంటే.. కాంగ్రెస్ పార్టీకి కొత్త తిప్పలు తీసుకువచ్చింది. గత ఎన్నికల్లో పోలిస్తే ఈసారి ఎలక్షన్లో… కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ గల్లంతయింది. దీంతో కొత్తగా నియామకమైన తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై సొంత పార్టీ నేతల విమర్శలు పెరిగాయి. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రేవంత్ రెడ్డినీ.. టార్గెట్ చేసి.. మాట్లాడుతున్నారు.
అయితే సొంత పార్టీ నేతల వ్యాఖ్యలపై ఇవ్వాళ తెలంగాణ కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి… మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నాయకుడినని.. అందుకే తాను అంటే ఎవరికీ నచ్చడం లేదని పేర్కొన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో కాంగ్రెస్ తప్పిదం వల్లే… భారీ ఓటమి ఎదురైందన్నారు. కాంగ్రెస్ పార్టీ స్టార్లు హుజరాబాద్ వెళ్లినా ఓట్లు రాల లేదని.. తాను వెళ్తే ఓట్లు వచ్చేవా అని ప్రశ్నించారు. ఇకనుంచి 2023 వరకు కాంగ్రెస్ పార్టీ సమస్యలు మరియు ఇతర రాజకీయాలపై తాను కామెంట్లు చేయనని ప్రకటించారు. తన సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి పై దృష్టి సారిస్తానని స్పష్టం చేశారు జగ్గారెడ్డి.