తెలంగాణాలో బీజేపీ రాజకీయం ఆషామాషీగా అయితే లేదు. టీఆర్ఎస్ కు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుండడం, కాంగ్రెస్ ఉనికి కోల్పోతుండడం వంటి పరిణామాలు తమకు కలిసి వస్తాయనే అంచనాల్లో ఉంది. ఇక్కడ మరింతగా బలపడాలని ఎప్పటికప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ వస్తోంది. ఏదో ఒక రకంగా తెలంగాణలో బిజెపి పరువును నిలబెట్టాలని చూస్తున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణలో వరుసగా ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అన్ని ఎన్నికల్లోనూ బిజెపికి విజయం అందించాలని, ఆ విషయాలను తన ఖాతాలో వేసుకోవాలని బండి సంజయ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రభావం ఈ ఎన్నికల్లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉండడం, కెసిఆర్, కేటీఆర్ మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఈ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో, బిజెపికి గట్టి పోటీ ఎదురవుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభావం పెద్దగా కనిపించకపోవడంతో, టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అనే అభిప్రాయం ప్రజల్లోనూ కలగడంతో, తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని, ఆయన నమ్ముతున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపొందితే ఇక బీజేపీ వచ్చే ఎన్నికల్లో తిరిగి చూడనవసరం లేదని, ఈ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుందని బీజేపీ నాయకులు నమ్ముతున్నారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి ఎన్నికలతో పాటు, దుబ్బాక ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో పవన్ కు మంచి పట్టు ఉండటం, పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని సంజయ్ నమ్ముతున్నారు.
పవన్ కనుక ప్రచారానికి ఒప్పుకుంటే, ఆయన కోరితే జనసేనకు కూడా కొన్ని డివిజన్లను కేటాయించి పోటీకి దింపాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా, కేంద్ర బిజెపి పెద్దలు ఎవరైనా ఈ విషయంపై పవన్ ను ఒప్పిస్తే, ఇక తిరుగే ఉండదు అనేది సంజయ్ ప్లాన్డ్ గా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే త్వరలోనే పవన్ కళ్యాణ్ ను కలవాలనే ప్రయత్నాల్లో సంజయ్ ఉన్నారు. పవన్ చాలా కాలంగా బీజేపీ అగ్ర నేతలను కలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్ర బిజెపి పెద్దల దర్శనమే పవన్ కు లభించలేదు. ఇప్పుడు వారు పవన్ ను ప్రచారానికి దిగాలని కోరితే పవన్ స్పందించే అవకాశం ఉంటుందనే లెక్కల్లో సంజయ్ ఉన్నారు.
-Surya