తనతో సమానంగా అభివృద్ధి చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని విశాఖ వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సవాల్ విసిరారు. గురువారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “మీరు చేసింది కబ్జాలు, అక్రమాలు, సొంత ఆస్తుల అభివృద్ధి. నేను చేసింది వార్డులో అభివృద్ధి పనులు, ప్రజాసేవ. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా? విశాఖ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తూ చెప్పుకోదగ్గ ఒక్క ప్రాజెక్ట్ తెచ్చారా? 22వ వార్డు కార్పొరేటర్గా వార్డులో నేను చేసిన అభివృద్ధిలో సగమైనా విశాఖ లోక్సక పరిధిలో చేసినట్టు నిరూపించగలరా?
సాటి ఎంపీలను, ప్రజాప్రతినిధులను కుక్కలుగా పోల్చిన ఎంవీవీ స్థాయి ఏమిటో ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఆయన ఎంపీ అయ్యాక విశాఖ నగర రహదారులు కనీస మరమ్మతుకు నోచుకోలేదని, కానీ ఎంవీవీ సిటీకి రెండువైపులా విశాలమైన రహదారులు వేయించారన్నారు. తన వెంచర్ల చుట్టూ రోడ్ల కోసం నగరపాలక సంస్థ నుండి కోట్లాది రూపాయల నిధులు పొందడం భారీ కుంభకోణమన్నారు. పేద వృద్ధులకు కేటాయించిన పదెకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా కొట్టేశారని ఆరోపించారు. సీబీసీఎంసీ భూములను కూడా కబ్జా చేశారన్నారు.