పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన తెలంగాణ రాజకీయాలపై కూడా ఫోకస్ చేసింది. ఇప్పటివరకు పవన్ ఏపీ రాజకీయాలపైనే ఫోకస్ చేస్తూ ముందుకెళుతున్నారు. అక్కడ పార్టీకి ఎంతో కొంత బలం ఉంది కాబట్టి, ఆ బలాన్ని మరింత రెట్టింపు చేసుకోవడమే లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నారు. అయితే పెద్దగా తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ చేయలేదు. కానీ తెలంగాణలో కూడా జనసేనకు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఇటీవల వారితో పవన్ సమావేశం కూడా జరిపారు.
ఇదే క్రమంలో నెక్స్ట్ తెలంగాణ బరిలో దిగాలని ఇక్కడ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుందని తెలుస్తోంది. అయితే ఇంతవరకు జనసేన తెలంగాణ బరిలో పోటీ చేయలేదు. ఏదో కొందరు స్థానిక నాయకులు….స్థానిక ఎన్నికల పోరులో అక్కడక్కడ మాత్రం పోటీ చేశారు…కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేయలేదు. రాబోయే 2023 ఎన్నికల్లో మాత్రం పోటీకి దిగాలని జనసేన కార్యకర్తలు కోరుతున్నారు.
దీనికి పవన్ కూడా అంగీకరించారని తెలుస్తోంది. కాకపోతే బిజేపితో పొత్తుతో బరిలో దిగితే కాస్త ఫలితం ఉంటుందని జనసేన నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. అయితే ఏపీలో ఏమో జనసేన-బిజేపి పొత్తు పెటాకులు అయ్యేలా కనిపిస్తోంది. అసలు తెలంగాణలో బిజేపితో పొత్తు విషయంలో ఏ మాత్రం క్లారిటీ లేదు. ఇప్పుడు ఏపీలో ఉన్న పొత్తు కూడా పోయేలా ఉంది.
ఒకవేళ పొత్తు కొనసాగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో బిజేపితో కలిసి పోటీ చేస్తే కనీసం తెలంగాణలో నాలుగైదు సీట్లు గెలుచుకోవచ్చనేది జనసేన నాయకుల ప్లాన్. ఎందుకంటే తెలంగాణలో బిజేపి స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి, జనసేనకి ప్లస్ అవుతుంది. అయితే పొత్తు లేకపోతే తెలంగాణలో జనసేనకు ఒక్క సీటు కూడా రావడం కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే అనేక పార్టీలు హోరాహోరీగా పోరాడుతున్నాయి. వారి మధ్యలో జనసేన గెలవడం కష్టమే.