Janasena Party: షాకిచ్చిన‌ ఎన్నిక‌ల సంఘం .. జ‌నాసేనాని చేజారిన గాజు గ్లాసు!

-

Janasena Party: జ‌న‌సేన అధినేత, ప‌వ‌ర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కు ఎదురుదెబ్బ త‌గిలింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో పోటీ చేయ‌డానికి సిద్దమ‌వుతున్న వేళ.. ఆయ‌న పార్టీ జ‌న‌సేన‌కు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఆ పార్టీ అధికారిక గుర్తు గాజు గ్లాసు దూర‌మ‌న‌ట్టే. ఇకపై ఆ పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించే అవకాశం లేదు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌లో జనసేన అధికారిక గుర్తును కోల్పోయింది.

జనసేన(Janasena)  గాజు గ్లాస్‌ గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ కేటగిరిలో చేర్చింది. అంటే.. ఈ గుర్తును రిటర్నింగ్‌ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్‌ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కనీసం పది శాతం సీట్లకు పోటీ చేయని కారణంగా ఈ గుర్తును తొలగించినట్లుగా ఎన్నికల సంఘం చెబుతోంది

అదేస‌మ‌యంలో.. రాష్ట్రంలో గుర్తింపు పొందిన మూడు ప్రాంతీయ పార్టీలకే రిజర్వుడ్‌ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్‌సీపీ కి సీలింగ్‌ ఫ్యాన్ గుర్తు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి సైకిల్ గుర్తు, టీఆర్‌ఎస్ పార్టీకి కారు గుర్తులను రిజర్వుడ్‌ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీలకు రిజర్వుడ్‌ గుర్తులుంటాయ‌ని పేర్కొంది కేంద్ర ఎన్నిక‌ల సంఘం.

Read more RELATED
Recommended to you

Latest news