ఏపీ సర్కార్ మరియు జనసేన పార్టీల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఆన్ లైన్ టికెట్ల విషయం లో వీరి మధ్య వివాదం చెలరేగింది. ఇందులో భాగంగానే.. రేపు జనసేన నిర్వహించే శ్రమధానం కార్యక్రమానికి కొర్రీలు పెట్టింది జగన్ సర్కార్. ధవళేశ్వరం బ్యారేజీ పై శ్రమదానం కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని తెలిపింది.
ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ వెనక్కి తగ్గింది. రేపు రాజమండ్రిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమధానం కార్యక్రమం వేదిక మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పేర్కొన్నారు.అనుమతి లేని కారణంగా ధవళేశ్వరం బ్యారేజీ పై కార్యక్రమం రద్దు చేసుకున్నామని ఆయన వెల్లడించారు.
ఇక రాజమండ్రి రూరల్ బాలాజీపేట సెంటర్ లో రేపు ఉదయం 9 గంటలకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉండనుందని ఆయన వెల్లడించారు. అనంతరం హుక్కుంపేట – బాలాజీ పేట రోడ్డు లో శ్రమధానంలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. పోలీసులు అనుమతి ఇవ్వడానికి ఇబ్బంది పెడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన పవన్ కళ్యాణ్ పర్యటన జరిగి తీరుతుందని స్పష్టం చేశారు కందుల దుర్గేష్. జగన్ సర్కార్ కావాలనే.. జనసేన పార్టీ పై కక్ష కట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.