జనగామ జిల్లా డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి అరెస్ట్ కొత్త మలుపు తీసుకుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. జంగాపై కావాలనే ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే, నేరస్తులకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీలు నిర్వహిస్తుందని అధికార పార్టీ నేతలు కౌంటర్ ఇచ్చారు. సెంట్రల్ జైల్ లో ఉన్న రాఘవరెడ్డికి ఇప్పుడు కరోనా సోకడంతో ఇష్యూ కొత్త మలుపు తిరిగింది.సెంట్రల్ జైలు ఎదుట ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు ఒక్కసారిగా స్పీడ్ పెంచారు.
కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలోని తన ఇంటిలో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తిపై దాడిచేసి చంపుతానని బెదిరించిన నేరారోపణతో నవంబరు 4న మడికొండ పోలీస్ స్టేషన్ లో జంగాపై కేసు నమోదైంది. ఈ క్రమంలో రెండు నెలలుగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నాడు. డిసెంబర్ 31న సాయంత్రం టేకులగూడెం ఫామ్ హౌజ్‌లో ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్నటాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన్ని అరెస్టుచేశారు. మడికొండ పోలీస్ స్టేషన్‌కు తరలించాల్సి ఉండగా, అల్లర్లు జరుగుతాయని భావించిన పోలీసులు.. వరంగల్ టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు.
ఈ కేసుపై గతంలో రాఘవరెడ్డి బెయిల్ కోసం వరంగల్ జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోగా.. కోర్టు తిరస్కరించింది. కోర్టు ఆదేశాలతో ఆయన్ని వరంగల్ సెంట్రల్ జైల్ కి తరలించారు. రాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రహస్య ప్రదేశంలో విచారించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేతలను అధికార పార్టీ నాయకులు కావాలనే కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. జైలులో ఉన్న జంగాతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు కాంగ్రెస్ నేతలు. ఆయనకు, ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జైలు ప్రధాన ద్వారం ముందే ఆందోళన చేపట్టారు. ఒక సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
జంగాపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ పోలీసు కమిషనర్ ప్రమోద్‌కుమార్‌కు వినతి పత్రం అందించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. ఓ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మడికొండ సీఐపై విచారణ చేపట్టాలన్నారు.
రాఘవరెడ్డిపై గతంలోనే రౌడీ షీట్ కూడా ఉంది. ప్రస్తుత కేసు తీవ్రత నేపథ్యంలో జిల్లా కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు..అయితే సెంట్రల్ జైలులో ఉన్న రాఘవరెడ్డికి కరోనా సోకడంతో ఆయన్ను వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు.
మొత్తానికి జంగా అరెస్ట్ వరంగల్ రాజకీయంలో అగ్గిరాజేసింది. అధికార బలంతో టీఆర్‌ఎస్ నేతలు కావాలనే జంగాను కేసుల్లో ఇరికించారని కాంగ్రెస్ నేతలు ఫైరవుతున్నారు. కొంత కాలంగా స్తబ్దుగా కాంగ్రెస్ కేడర్ జంగా అరెస్టుతో స్పీడ్ పెంచింది.