BREAKING : సముద్రంలో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. 10 మంది సైనికులు గల్లంతు

-

జపాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. జపాన్‌ దక్షిణ దీవుల్లో నిఘా ఆపరేషన్ కోసం వెళ్లిన సైనిక హెలికాఫ్టర్‌ సముద్రంలో కుప్పకూలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ రక్షణ శాఖ వెల్లడించింది. ఒకినావా ద్వీపం దగ్గర్లో ఉన్న మియాకోజిమా సమీపంలో హెలికాప్టర్ కూలినట్లు రక్షణశాఖ మంత్రి యసుకాజు హమదా తెలిపారు. ఘటన సమయంలో హెలికాఫ్టర్‌లో 10 మంది సైనికులు ప్రయాణిస్తున్నారని.. వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

టోక్యోకు 1800 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో హెలికాఫ్టర్‌ శకలాలను గుర్తించినట్లు జపాన్ రక్షణమంత్రి యసుకాజు హమదా తెలిపారు. వారికోసం గాలింపు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. కూలిన హెలికాప్టర్‌కు సంబంధించిన ఒక లైఫ్‌ బోటు, ఒక తలుపు దొరికినట్లు పేర్కొన్నారు. గాల్లోకి ఎగిరిన పదినిమిషాలకే UH-60JA బ్లాక్‌హాక్‌ హెలికాఫ్టర్‌.. రాడార్‌తో సంబంధాలు కోల్పోయిందని అధికారులు తెలిపారు.

జపాన్‌లోని దక్షిణ ద్వీపంలోని కీలకమైన ఆర్మీ బేస్‌లో ఈ హెలికాప్టర్‌ను ఉంచినట్లు అధికారులు తెలిపారు. కూలిపోయిన హెలికాప్టర్‌కు గతనెల చివర్లో సాధారణ భద్రతా తనిఖీలు చేశారని.. ఎలాంటి సమస్యలు తలెత్తలేదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news