తెలుగు రాష్ట్రాలను వరసగా వాయు’గండాలు‘, తుఫానులు విడిచిపెట్టడం లేదు. తాజాగా మరో సారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండం, తుఫానుగా మారనుంది. నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 17న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలపడి.. 18 వ తేదీన ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరి ’జవాద్‘ తుఫానుగా మారే అవకాశం ఉందిన ఐఎండీ తెలిపింది. ఇప్పటికే అల్పపీడన ప్రభావంతో తెలంగాణ, ఏపీల్లోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితులతో నేడు, రేపు రాయలసీమ, కోస్తా ఆంధ్రాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 18,19 తేదీల్లో క్రిష్ణా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తామని హెచ్చరించింది. తెలంగాణ ప్రాంతంలో తేలికపాటి జల్లులు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.