ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తున్నది. మొత్తం ఆరు స్థానాలకు గాను నలగురు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. మరో రెండు స్థానాల్లో అభ్యర్థుల మాత్రం సందిగ్ధం నెలకొన్నది. మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి తక్కెలపల్లి రవీందర్‌రావు, హుజూరాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్‌రెడ్డికి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తున్నది. సాయంత్రం వరకు నలుగురు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
స్థానాల్లో తక్కువగా ఉండటం ఆశావహులు ఎక్కువగా ఉండటంతో గులాబీ బాస్ కేసీఆర్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు ఎన్నిక పూర్తికాగా, మరో రెండు స్థానాల్లో అభ్యర్థులు ఎవరనేది స్పష్టం కాలేదు. అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, నాగార్జున సాగర్ నియోజకవర్గ నేత ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, తాడూరి శ్రీనివాస్, పిట్టల రవీందర్‌కు టీఆర్‌ఎస్ అధిష్ఠానం నుంచి పిలుపు అందింది. కానీ, వీరిలో ఎవరికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం దక్కుతుందనే విషయమై స్పష్టత లేదు.
మరోవైపు నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నది. తొమ్మిది జిల్లాల్లో 12 స్థానాలు భర్తీ కానున్నాయి. ఎమ్మెల్యే కోటాలో అవకాశం దక్కని వారికి స్థానిక సంస్థలో కోటాలో ఎంపిక చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మధుసూదనాచారి, ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంసీ కోటిరెడ్డి, ఆకుల లలిత, తాడూరి శ్రీనివాస్, పిట్టల రవీందర్‌లలో ఇద్దరికి ఎమ్మెల్యే కోటాలో అవకాశం కల్పించి, మిగిలిన వారికి స్థానిక కోటాలో అవకాశం ఇవ్వచ్చని టీఆర్‌ఎస్ వర్గీయులు చర్చించకుంటున్నాయి.
2022, జూన్‌లో రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు రెన్యూవల్ దక్కే అవకాశం దాదాపు లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆశిస్తున్న సీనియర్ లీడర్లకు రాజ్యసభ హామీ లభించే అవకాశం కనిపిస్తున్నది. ఏదిఏమైనా నేటి సాయంత్రంతో నామినేష్ల గడువు ముగుస్తుండటంతో ఎమ్మెల్యే కోటాలో పోటీ చేసే ఆరుగురు అభ్యర్థుల పేర్లు బహిర్గతం కానున్నది.