ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ పై పిఠాపురం పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. చర్యలు తీసుకునే విషయంలో హోంమంత్రి అనిత బాధ్యత వహించాలని సూచించారు. మీ ఇంట్లో ఆడవాళ్లను రేప్ చేస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడాన్ని వైసీపీ భావప్రకటన స్వేచ్ఛ అంటుందని మండిపడ్డారు. తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లా చేయాలని హెచ్చరించారు పవన్ కళ్యాణ్.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత, తాడిపత్తి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. గత ఐదేళ్లలో ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా ఇంకా అధికారుల తీరు మారడం లేదని వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైసీపీకి పూర్తిగా దాసోహమయ్యారని ఆరోపించారు. ఆర్థిక, రాజకీయ ఒత్తిడులకు ఉన్నతాధికారులకు తలొగ్గకూడదని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.