కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి స్వాగతించారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందునడుస్తూ, క్రియాశీలక భూమిక పోషించాలని, దానికి తమ సంపూర్ణ మద్దతుంటుందని చెప్పారు.
కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి ప్రగతిభవన్లో జాతీయ రాజకీయాలపై చర్చించారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్రంలో ఎనిమిదేళ్ల పాలనపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని కుమారస్వామి అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ అవసరమున్నదని ఆయన పేర్కొన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ అజెండాపై ఇద్దరు నేతలు చర్చించారు.
మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చించి ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించామని.. త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటు, విధివిధానాల రూపకల్పన జరుగుతుందని కుమారస్వామికి సీఎం కేసీఆర్ తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకొని, ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ సాధించిన కేసీఆర్ అపార అనుభవం దేశానికి ఎంతో అవసరం ఉందని కుమారస్వామి అన్నారు.