దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన విద్యార్థులు మే 7వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మే 8 సాయంత్రం 5గంటల వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజుగా.. మహిళలు/ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులకు రూ.1450; ఇతర విద్యార్థులందరికీ రూ.2900ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ఇప్పటికే జేఈఈ-మెయిన్ 2023 రెండో సెషన్ ఫలితాలు వెల్లడైన సంగతి తెలిసిందే. జేఈఈ-అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే వారు jeeadv.ac.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి. జేఈఈ-మెయిన్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకులు వచ్చిన విద్యార్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్ 2023 పరీక్ష రాసేందుకు అర్హులు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్ఫూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐటీ గువాహటి, ఐఐటీ రూర్కే సంయుక్త ఆధ్వర్యంలో జేఈఈ అడ్వాన్స్‌డ్-2023 పరీక్ష ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు.