టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు తెర పైకి‌ తెచ్చింది అందుకేనా

-

టీడీపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు మళ్ళీ టీడీపీ శ్రేణుల్లో తెర పైకి వచ్చింది. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన కామెంట్స్ పార్టీలో పెద్ద చర్చనే లేపాయి. టీడీపీలో నాయకత్వ మార్పు గురించి చెబుతూ.. బాలయ్య, లోకేష్‌లతోపాటు జూనియర్‌ ఎన్టీఆర్‌ పేరును ఆయన ప్రస్తావించారు. అన్ని వర్గాల నుంచి యువ నేతలు రావాల్సిన సమయం ఇదేనని ఒక సూచన చేశారు ఈ సీనియర్‌ నేత. అనూహ్యంగా జూనియర్ పేరు బుచ్చయ్య తెరపైకి తీసుకురావడంతో ఇప్పుడు టీడీపీ నేతల్లో చర్చ మొదలైంది.

టీడీపీ వ్యవహారాలు, నాయకత్వ పోకడలపై బుచ్చయ్య చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు. దానికితోడు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. అలాంటి కీలక పొజిషన్‌లో ఉన్న నాయకుడు చేసిన కామెంట్స్‌ కావడంతో.. దాని వెనక ఉన్న అర్థం పరమార్థం ఏంటని ఆరా తీస్తున్నాయి రాజకీయ వర్గాలు. అన్ని సామాజికవర్గాల నుంచి యువత పార్టీ కోసం రావాలని చెప్పడం వరకు బాగానే ఉన్నా.. ఆయా వర్గాల నుంచి ప్రతినిధులుగా ఉన్న సీనియర్లను ఇక పక్కన పెట్టాలి అన్న అర్థం ధ్వనిస్తోంది. వాస్తవాలకు అనుగుణంగా నాయకత్వం పని చెయ్యాలి అనడం ద్వారా.. పార్టీలో ఆయన మార్పులు కోరుకున్నట్టుగా భావిస్తున్నారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తావన టీడీపీలో అప్పుడప్పుడు వినిపిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో జూనియర్ పేరు తెరపైకి రావడం కొత్తేమీ కాదు. కాకపోతే పొలిట్ బ్యూరోలో ఉన్న నేత జూనియర్‌తో సహా అందరూ రావాలనడం కొంత ఆసక్తికరమే. చంద్రబాబు తర్వాత లోకేష్ అనేది పార్టీలో అందరికీ తెలిసిందే. జూనియర్ పేరు తేవడం మాత్రం నాయకత్వానికి కొంత ఇబ్బంది కలిగించే అంశం. అది తెలిసి కూడా బుచ్చయ్య ఏం చెప్పాలనకున్నారన్నదే ప్రశ్న. లోకేష్, బాలయ్యలతో పాటు జూనియర్ కూడా ఉంటారు అనడం ఇప్పుడు అప్రస్తుతం. సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌.. రాజకీయాలపై మాట్లాడటానికి ఇది సమయం కాదు.. సందర్భం కాదు అని ఆ మధ్య తేల్చేశారు.

బుచ్చయ్య లేవనెత్తిన అంశం పార్టీ బహిరంగ వేదికల మీద చెప్పకూడని వ్యాఖ్యలు కాకున్న సందర్భం చర్చగా మారింది. పార్టీ 40వ వ్యవస్థాపక దినోత్సవంనాడు నాయకత్వం.. టీడీపీలో పోకడలపై ఆయన చేసిన కామెంట్స్‌ పార్టీలో పరిస్థితికి అర్థం పడుతున్నాయని తెలుస్తుంది. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉంటున్న నాయకుడి అభిప్రాయం కావడంతో ఇంకా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా చంద్రబాబు, లోకేష్‌ నాయకత్వంలోనే టీడీపీ నడుస్తుంది. మరి.. బుచ్చయ్య నోటి వంటి వచ్చిన ఈ వ్యాఖ్యలు పార్టీలో ఉత్సాహానికా… లేక నాయకత్వ ప్రక్షాళనకా అనే విధంగా ఉన్నాయి.

జూనియర్ పేరు తేవడం ద్వారా ఇప్పుడున్న నాయకత్వం అంత పటిష్టంగా లేదు అనే అభిప్రాయం బుచ్చయ్య వ్యక్తం చేసినట్లు అయ్యింది. దీనిపై అటు అధిష్ఠానం కూడా ఏమీ స్పందించలేని పరిస్థితి. అధినేతకు సరైన సలహాలు ఇవ్వడంలో తప్పు దోవ పట్టిస్తున్నారని ఆయన ఎప్పుడూ భావిస్తూ ఉంటారట. పార్టీలో ఒక కోటరీ అధిష్ఠానాన్ని రాంగ్ డైరెక్షన్‌లో తీసుకెళ్తుందనేది బుచ్చయ్య గట్టి వాదన. తాజా వ్యాఖ్యల వెనక కూడా ఆ అభిప్రాయమే కారణమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news