ఎన్నికల ప్రచారంలో నోరు జారిన జ్యోతిరాధిత్య సింథియా…!

రాజకీయ నేతలకు ఓ పార్టీ నుంచి ఓ పార్టీలోకి జంప్ చేయడం సాధారణమే. అయితే, పాత పార్టీ వాసన పోవాలంటే మాత్రం.. ఆ నాయకులకు కొంత సమయం పడుతుంది. చేరిన వెంటనే కొత్త పార్టీకి జైకొట్టాలన్నా..సమయానికి మాత్రం పాత పార్టీనే గుర్తుకువస్తుంది. బీజేపీకి ప్రచారం చేస్తూ కాంగ్రెస్‌కు ఓటెయ్యాలంటూ ఇలానే నోరు జారారు.ఒకప్పటి హస్తం పార్టీ నేత జ్యోతిరాదిత్య సింథియా. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంపాటు పనిచేసిన సింథియా.. తన అనుచరులైన 22 మంది ఎమ్మెల్యేలతో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు.

గ్వాలియర్‌లోని దబ్రా టౌన్‌లో బీజేపీ అభ్యర్థి ఇమర్తి దేవికి మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో సింథియా పాల్గొన్నారు. శివరాజ్ సింగ్ ప్రభుత్వానికి మద్దతుగా అందరూ బీజేపీకి గుర్తు కమలానికి ఓటు వేయాలని కోరాల్సింది పోయి.. పొరపాటున కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటువేయాలని అభ్యర్థించారు. దీంతో ఆయన పక్కనే ఉన్న నేతలు అప్రమత్తం చేయడంతో వెంటనే సర్దుకుని కమలం గుర్తుకు ఓటేయాలని కోరారు జ్యోతిరాదిత్య సింథియా. ఈ వీడియోను మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. సింథియాజీ మీరు చెప్పినట్టే ప్రజలు హస్తానికి ఓటెస్టారు అని ట్వీట్ చేసింది.