రాజకీయాల్లో చిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఒక్కొక్కసారి ఇవి నిజమేనా ? అనే ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఇలాంటి ఘటనే ఒకటి ప్రకాశం జిల్లా చీరాలలో చోటు చేసుకుంది. ఇక్కడ గడిచిన ఆరేళ్లలో అనేక మార్పులు, చేర్పులు చోటు చేసుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీ ఇంచార్జ్‌గా ఎడం బాలాజీ ఇక్కడ చక్రం తిప్పారు. అప్పట్లో పోతుల సునీత.. టీడీపీ తరఫున ఇక్కడ నుంచి పోటీ చేశారు. ఇక, ఇండిపెండెంట్‌గా ఆమంచి కృష్ణమోహన్.. వైసీపీ అభ్యర్థిగా బాలాజీలు పోటీ చేశారు. వీరిలో ఆమంచి గెలుపు గుర్రం ఎక్కారు. అనంతరం ఆమంచిపై అప్పటి టీడీపీ ప్రభుత్వం వరుసగా కేసుల్లో ఇరికిస్తుండడంతో ఆయన ఇష్టం లేకపోయినా బలవంతంగా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతవరకు బాగానే నడిచింది.
అయితే.. గత ఏడాది ఎన్నికలకు ముందు అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పటి వరకు టీడీపీ మద్దతు దారుగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, అప్పటి వరకు చీరాల వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న బాలాజీ.. ఆమంచి రాకను విభేదిస్తూ.. టీడీపీలోకి జంప్ చేశారు. వాస్తవానికి ఈయన కరణం బలరాం శిష్యుడే. అయితే, గత ఎన్నికల్లో టికెట్ వస్తుందని అనుకున్నా.. చంద్రబాబు బాలాజీని పక్కన పెట్టి.. అద్దంకి నుంచి తీసుకువచ్చి అప్పటి వరకు ఎమ్మెల్సీగా ఉన్న కరణానికి చీరాల టికెట్ ఇచ్చారు.
గురువు కరణం గెలుపునకు బాలాజీ ఇతోధికంగా కృషి చేశారు. ఇక, పోతుల సునీత ఎమ్మెల్సీ కావడంతో ఏకంగా నియోజకవర్గం నుంచి తప్పకొన్నారు. వీరికి తోడు మాజీ మంత్రి పాలేటి రామారావు సైతం కరణం గెలుపు కోసం పనిచేశారు. గత ఎన్నికల్లో ఆమంచి ఓడిపోయారు. కరణం.. టీడీపీ టికెట్‌పై విజయం సాధించారు. అయితే.. తన కుమారుడి భవితవ్యం కోసం .. ఆయన వైసీపీ కి మద్దతుగా దారుగా మారారు. ఇక, ఆమంచికి కరణానికి మధ్య విభేదాలు భారీ రేంజ్‌లో కొనసాగుతున్నాయి.
కరణం టీడీపీకి కూడా అనధికారిక ఇన్‌చార్జేనా…
ఇదిలావుంటే.. టీడీపీ ఇంచార్జ్ బాలాజీ..తన శిష్యుడే కావడం.. తాను చీరాల టీడీపీ ఎమ్మెల్యే కావడంతో అన్నీ తానై.. అటు టీడీపీని కూడా తన కనుసన్నల్లో ఉంచుకుని మేనేజ్ చేస్తున్నారట కరణం. ప్రస్తుతం ఈ ప్రచారం చీరాలలో జోరుగా జరుగుతోంది. అంటే.. ఒకవైపు వైసీపీకి మద్దతు దారుగా ఉంటూనే అటు టీడీపీ ఇంచార్జ్‌ని తన చెప్పుచేతుల్లో ఉంచుకుని, ఇటు ఎమ్మెల్యేగా… అటు టీడీపీ అనధికారిక ఇన్‌ఛార్జ్‌గా అధికారం చలాయిస్తున్నారు. దీంతో ఇక్కడి రాజకీయం భిన్నంగా మారిపోయింది.
అంటే.. ఒకే సమయంలో కరణం.. అటు టీడీపీని, ఇటు వైసీపీని కూడా మేనేజ్ చేస్తున్నారన్న మాట. కరణం మనిషిగా ఆయన, ఆయన కుమారుడు వెంకటేష్ వైసీపీలో ఉన్నా.. ఆయన మనసంతా టీడీపీలోనే ఉందంటున్నారు. రేపటి వేళ వైసీపీలో ఉండలేని పక్షంలో మళ్లీ ఆయన టీడీపీలోకి జంప్ చేసి తన శిష్యుడు యడం బాలాజీని పక్కన పెట్టి మళ్లీ అక్కడ నాయకుడిగా మారినా ఆశ్చర్యం లేదంటున్నారు చీరాల ప్రజలు. దీంతో ఏం రాజకీయం బాస్! అని ముక్కున వేలేసుకుంటున్నారు చీరాల ప్రజలు.