నిజామాబాద్ సభలో ప్రధాని మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశపడ్డాం. దానికి భిన్నం తెలంగాణ సమాజాన్ని అగౌరపరిచేలా.. కేసీఆర్ ను అవమాన పరిచేలా.. మాట్లాడడం జుగుప్సకరమని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎంలు, ప్రధానితో ఎన్నో విషయాలు చర్చిస్తారు. వాటిని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గు చేటన్నారు.
విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, వాటిని ఎందుకు తొక్కిపెట్టారని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. తొమ్మిదేళ్లలో తెలంగాణకు చేసిన మేలు ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన విశ్వవిద్యాలయం స్థాపించడానికి పదేళ్లు అవసరమా..? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అవసరమా..? అని ప్రశ్నించారు. దళిత, మైనార్టీ వ్యతిరేక విధానం అవలంబించిన బీజేపీ తెలంగాణలో అవసరమా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని చెప్పారు.