ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంల మధ్య కొత్త జగడం అందుకేనా

ఒకే నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఉప్పు నిప్పుగా మారారు. ప్రత్యర్ధి పార్టీ నేతల మాదిరి మాటల తూటాలు పేలుస్తున్నారు. డిప్యూటీ సీఎంలు గా పని చేసిన కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య ఇద్దరు టీఆర్ఎస్ సీనియర్ నేతలే. కానీ వీరిద్దరి మధ్య వైరం మాత్రం ఇనాటిది కాదు. ఇద్దరు స్టేషన్‌ ఘనపూర్‌ నియోజకవర్గానికి చెందిన నేతలే కావడంతో ఆధిపత్యం కోసం కత్తులు దూస్తున్నారు. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న వీరిద్దరి మధ్య మళ్లీ కొత్త జగడం మొదలైంది.

రాజయ్య స్టేషన్‌ ఘనపూర్‌ ఎమ్మెల్యే గా ప్రాతినిధ్యం వహిస్తుండగా కడియం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఎన్నికల సమయంలో టిక్కెట్ కోసం ఈ ఇద్దరినేతల మధ్య గ్యాప్‌ వచ్చినా పార్టీ పెద్దల జోక్యంతో కలిసి పనిచేశారు. మళ్లీ ఏమైందో ఏమో సై అంటే సై అంటూ తొడ కొడుతున్నారు. ఇద్దరు నేతలు ఒకే సామాజికవర్గం పైగా ఇద్దరు తొలి తెలంగాణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పని చేశారు.వీరిద్దరి విభేదాలు మళ్లీ నియోజకవర్గంలో సెగ పుట్టిస్తున్నాయి.

ఈ నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ నుంచి వరసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కడియం శ్రీహరి. మంత్రిగానూ పనిచేశారు. తాటికొండ రాజయ్య కాంగ్రెస్‌ నుంచి గెలిచి తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆనాటి ఉప ఎన్నికలో సైతం రాజయ్యే గెలిచారు. తర్వాత కాలంలో శ్రీహరి టీఆర్‌ఎస్‌లో చేరినా రెండువర్గాల మధ్య ఉప్పు నిప్పుగానే ఉంది. రాజయ్యను డిప్యూటీ సీఎంగా తొలగించిన తర్వాత ఆ స్థానంలో కడియం డిప్యూటీ సీఎం అయ్యారు. దీంతో రెండు వర్గాల మధ్య మరింత గ్యాప్‌ వచ్చింది.

ఎన్నికల సమయంలో కేటీఆర్‌ రాజీ కుదర్చడంతో రాజయ్య, శ్రీహరి ఒక్కటయ్యారు. కానీ.. స్థానిక ఎన్నికల సమయానికి మళ్లీ కత్తులు దూశారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఇద్దరు నాయకులు ఆధిపత్యపోరుకు దిగారు. సభలు, సమావేశాల నిర్వహణలో ఎత్తుకు పైఎత్తులు వేశారు. రాజయ్యను పిలవకూడదని స్టేషన్‌ ఘనపూర్‌కు చెందిన కార్యకర్తలతో హన్మకొండలో మీటింగ్‌ పెట్టారు కడియం. దీంతో మళ్లీ ఇద్దరు నేతల మధ్య అగ్గి రాజుకుంది.

కొద్దిరోజుల్లో గ్రేటర్‌ వరంగల్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు రానుండటంతో ఈ ఇద్దరు సీనియర్ నేతల ఆధిపత్య పోరు పార్టీ నేతలను కలవరానికి గురి చేస్తుంది.