తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణ ఘటన ఒకటి చోటుచే సుకుంది..కాకినాడకు చెందిన తొమ్మిదో వార్డు కార్పొరేటర్ అయిన కంపర రమేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈయన గత కొంత కాలంగా వైసీపీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నాడు. నిన్న రాత్రి సొంత పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయన మీద దాడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో ఆయనను కారుతో ఢీ కొట్టి ప్రజలు చంపేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన కాకినాడ ఆర్డీవో కార్యాలయం రోడ్డు కారు షెడ్ సమీపంలో చోటు చేసుకుందని తెలుస్తోంది. స్థానికుల ద్వారా ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలికి చేరుకుని రక్తపుమడుగులో పడివున్న రమేష్ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రమేష్ మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఇక పోస్టుమార్టం నిమిత్తం రమేష్ మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.