కాంతార కంటే ముందే రిషబ్ ఓ తెలుగు సినిమాలో నటించారని తెలుసా?

-

‘కాంతార’ సినిమాతో రిషభ్​ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఆ మూవీకి దర్శకుడిగా, హీరోగా పనిచేసిన రిషభ్​ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. మన తెలుగులోనూ ఫుల్​ క్రేజ్​ తెచ్చుుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయనితో సినిమాలు చేసేందుకు అన్ని భాషల్లోని ప్రొడ్యూసర్లు క్యూ కడుతున్నారు. కానీ కథల ఎంపికలో ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

ఒకవైపు దర్శకుడు, హీరోగా సినిమాలు చేస్తూనే.. ఎలాంటి పాత్రలనైనా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు రిషభ్​. అయితే ఇప్పుడు రిషభ్​ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

అదేంటంటే.. కాంతార సినిమా కంటే ముందే ఆయన ఓ తెలుగు సినిమాలో నటించారని తెలుసా? కానీ అప్పుడు రిషబ్ అంత పాపులర్ కాకపోవడంతో ఎవరూ గుర్తించలేదు. ఆ చిత్రంలో రిషబ్ శెట్టి పాత్ర చాలా చిన్నది. కేవలం రెండు నిమిషాలు మాత్రమే తెరపై కనిపిస్తారు. అదేమీ స్టార్ హీరో సినిమా కాదు. ముగ్గురు పిల్లల సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ఆ చిత్రంలో రిషభ్​ ఓ దొంగ పాత్ర పోషించారు.

ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీతో హిట్ అందుకున్న దర్శకుడు స్వరూప్ ఆ ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాను డైరెక్ట్ చేశారు. రఘుపతి రాఘవ రాజారామ్ అనే ముగ్గురు స్నేహితులు ముంబయి డాన్ దావుద్ ఇబ్రహీంను పట్టిస్తే లక్షల్లో డబ్బు వస్తుందని, ఎలాగైనా అతడిని పట్టుకోవాలని చెప్పి ఇంట్లో చెప్పకుండా ముంబయి వెళ్తారు. అయితే వాళ్ళు ఈ మిషన్​ను ఎలా పూర్తి చేశారు.. చివరికి ఆ డబ్బును పొందారా..? లేదా అనేది కథలో కీలకాంశం.

ఇందులో భాగంగానే ఖలీల్​ అనే దొంగ పాత్ర పోషించారు రిషభ్​. గతంలో ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మూవీ చూసిన రిషభ్​ శెట్టి.. స్వరూప్‌తో స్వయంగా మాట్లాడి అభినందించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. దాంతో ఆ ఖలీల్ పాత్ర కోసం అడగ్గానే.. చేయడానికి రిషభ్​ శెట్టి ఒప్పుకున్నారట. స్వరూప్‌తో ఉన్న ఫ్రెండ్‌షిప్ కారణంగా ఆ సినిమాకు కనీసం ఒక్క రూపాయి కూడా రిషబ్ తీసుకోలేదని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news