టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ పై భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ లాంటి గొప్ప ఆటగాడు సెంచరీ లేకుండా చాలా కాలం గడపడం బాధగా ఉందని అన్నారు. ఒక ఆటగాడి ప్రదర్శన సరైన స్థాయిలో లేకుంటే మాజీ ఆటగాడిగా దాన్ని ప్రశ్నించే హక్కు తనకు ఉందని ఆయన పేర్కొన్నారు.” ఇంత పెద్ద ఆటగాడు చాలా కాలంగా సెంచరీ చేయకపోవడం చాలా బాధగా ఉంది.
అతను మాకు హీరో లాంటి వాడు. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లతో పోల్చగలిగే ఆటగాడిని మనం చూస్తాం అని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇంత పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్న కోహ్లీ సెంచరీ కోసం ఇన్నాళ్ళు తీసుకోవడం చాలా బాధాకరం. అతను రెండేళ్లుగా సెంచరీ చేయకపోవడంతో అతని అభిమానులతోపాటు మేము నిరాశ లో ఉన్నాం. నేను కోహ్లీ అంత క్రికెట్ ఆడలేదు. మీరు పరుగులు చేయకపోతే ఎక్కడో ఏదో తప్పు జరిగింది అనుకుంటారు. అభిమానులు మీ ఆటతీరును మాత్రమే చూస్తారు. అది సరిగా లేకుంటే వారు మౌనంగా ఉంటారని ఆశించవద్దు.అందుకే మీ బ్యాట్ ప్రదర్శన మాత్రమే మాట్లాడాలి” అని కపిల్ దేవ్ అన్నారు.