కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీల మధ్య రాజకీయాలే కాకుండా కుటుంబ రాజకీయాలు కీలక మలుపు తిరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో హసన్ నియోజవర్గ టికెట్ ఆశించిన కోడలు భవానికి జేడీఎస్ అధినేత దేవెగౌడ షాక్ ఇచ్చారు.
భవానీ రేవన్న పోటీ చేయాలనుకున్న హసన్ నియోజకవర్గానికి హెచ్‌పీ స్వరూప్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. హసన్ సహా కర్ణాటకలోని 49 స్థానాలకు దేవెగౌడ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ పరిణామం.. దేవెగౌడ కుటుంబ రాజకీయాన్ని ఎలాంటి మలుపు తిప్పుతుందనేది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటకలోని 224 శాసనసభ నియోజకవర్గాలకు.. ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి అనేక నెలల ముందే.. 2022 డిసెంబర్లో అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది జేడీఎస్. మొదటి విడతలో 93 మంది పేర్లు ఖరారు చేసింది. ఈ నెల 4నే రెండో జాబితా వస్తుందని తొలుత అంతా భావించారు. అయితే.. భవానీ రేవన్నకు టికెట్ ఇవ్వడంపై దేవెగౌడ కుటుంబంలో భేదాభిప్రాయాలు వచ్చాయి. ఫలితంగా టికెట్ల కేటాయింపు ఆలస్యమైనట్లు తెలిసింది.