కర్ణాటకలో బీజేపీని ఎదురొడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరేసిన కాంగ్రెస్ సీఎం ఎవరన్నేదానిపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఈ అంశంపై కొనసాగుతన్న ఉత్కంఠకు ఇప్పట్లో తెరపడేలా లేదు. పార్టీ విజయానికి కృషిచేసిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్ .. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో సీఎం ఎంపికలో పీఠముడి ఏర్పడింది. ఇద్దరిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేస్తే మరొకరు తిరుగుబాటు చేస్తారా అనే సంశయం పార్టీలో నెలకొన్నది. దీంతో పార్టీ అధిష్ఠానం సీఎం ఎంపికలో మల్లగుళ్లాలు పడుతోంది.
తనను ముఖ్యమంత్రి నైనా చేయండి లేదా ఎమ్మెల్యేగా ఉండనీయండని కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గేతో అన్నట్లు తెలుస్తున్నది. సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకేతో ఖర్గే విడివిడిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్యకు ఇప్పటికే ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారని.. ఈసారి తనవంతు. అని శివకుమార్ అన్నట్లు తెలిసింది. అందుకే తనను ముఖ్యమంత్రిని చేయాలని పార్టీ అధ్యక్షుడితో అన్నట్లు సమాచారం. ఆయనకు సీఎంగా మరోసారి అవకాశం కల్పిస్తే తనను ఎమ్మెల్యేగా ఉండనీయాలని కోరినట్లు తెలిసింది.