బెంగళూరును అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. నగర ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఇటీవల కురిసిన వర్షాలకు బెంగళూరు నగరం పూర్తిగా మునిగిపోయిన వేళ బృహత్ బెంగళూరు మహానగర పాలికె చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ముందుగా అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపింది.
నొయిడాలోని ట్విన్ టవర్స్ మాదిరిగానే బెంగళూరులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని హెచ్చరించారు ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఆర్. అశోక్. నగరంలో వరద నీరు వెళ్లకుండా నిర్మించిన అక్రమాల కూల్చివేత ప్రక్రియను చేపట్టింది. మహదేవెపుర జోన్ పరిధిలోని శాంతినికేతన లేఔట్ సహా పలు ప్రాంతాల్లోని ఈ అక్రమాల తొలగింపును చేపట్టింది బృహత్ బెంగళూరు మహానగర పాలికె.
“సరైన పత్రాలు లేకపోతే ఎంతటి వారినైనా వదిలిపెట్టొదని డిప్యూటీ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేశాను. చిన్నా పెద్దా తేడా లేకుండా తొలగించాలని చెప్పా. చాలా ఐటీ సంస్థలు అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. సుమారు 30 సంస్థల జాబితాను తయారు చేసి తొలగించాలని ఆదేశాలిచ్చాం.”
ఆర్. అశోక్, కర్ణాటక రెవెన్యూ శాఖమంత్రి