తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై తమ నిర్ణయాన్ని రెండు రోజుల్లో ప్రకటిస్తామని టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. టీడీపీ సెంట్రల్ కమిటీతో తాజాగా ఆయన భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందామని లోకేశ్ తెలపగా, పోటీ చేయాలని టీటీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. కమిటీ నిర్ణయంపై కాసాని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నిన్న కాసాని మాట్లాడుతూ, తెలంగాణలో పోటీ చేస్తే ఒక్కో అభ్యర్థికి 5, 6 వందల ఓట్లు కూడా రావని చంద్రబాబుకు కొందరు తాప్పుడు సమాచారం ఇచ్చారని, దాంతోనే పోటీకి దూరంగా ఉండాలని ఆయన చెప్పారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది నుంచి పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కృషి చేశామన్నారు. పార్టీ సభ్యత్వం కోసం అందరం పాటుపడ్డామన్నారు. తెలంగాణలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం విజయవంతం చేశామన్నారు.
చంద్రబాబు జైలుకు వెళ్లే ముందే ఎన్నికల్లో పోటీపై కమిటీ వేశారని, ముందు ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే సమయంలో కమిటీలో ఉన్నవాళ్లను ప్రకటిద్దామని చెప్పానన్నారు. కానీ కమిటీలో ఉన్నవాళ్లు ఒప్పుకోలేదని, టికెట్ ఆశించే అభ్యర్థి నుంచి అప్లికేషన్ కోసం 50 వేలు తీసుకోవాలని నేతలు చెప్పారని, దాన్ని తాను వ్యతిరేకించాన్నారు. సినీనటుడు బాలకృష్ణ సైతం వచ్చి ప్రచారం చేస్తారని, ఆ తర్వాత పోటీ చేయడం లేదని ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో కొంత మంది టీడీపీ పోటీ చేయడం లేదని, కాంగ్రెస్‌కు ఓటు వేయాలని ప్రచారం చేశారని మండిపడ్డారు. రాజకీయ పార్టీ ఎన్నికల్లో నిలబడకపోతే ఇంకా దేనికోసం అని ప్రశ్నించారు. ఎన్ని ఓట్లు వచ్చినా ఎన్నికల్లో పోటీ చేయాలని, కానీ తెలంగాణలో పార్టీ ఓడిపోతే ఆ ప్రభావం ఏపీపై పడుతుందని అంటున్నారన్నారు.