జమ్మూలో ఉగ్ర ఘాతుకం.. 6గురు పౌరులకు తీవ్రగాయాలు.

వరసగా ఉగ్రదాడులు భద్రతా బలగాలకు సవాలు విసురుతున్నాయి. ఇటీవల జరుగుతున్న ఉగ్రదాడుల్లో సాధారణ పౌరులు మరణిస్తున్నారు. ఇన్నాళ్లు నాన్ లోకల్ పౌరులను టార్గెట్ గా చేసుకున్న ఉగ్రవాదులు తాజాగా భద్రతా బలగాలపై దాడులు చేస్తున్నారు. తాజాగా జమ్ము కాశ్మీర్ బందీపోరా జిల్లాలో భద్రతా బలగాలను టార్గెట్ గా చేసుకుంటూ గ్రానెడ్ దాడి చేశారు. బందిపోరా లోని సంబల్ బ్రిడ్జ్ వద్ద గ్రానెడ్ దాడి జరిగింది. 

అయితే ఉగ్రవాదులు చేసిన దాడి గురి తప్పడంతో ప్రమాదం తప్పింది. భద్రతా బలగాల కాన్వాయ్ కదులుతున్న సమయంలో ఉగ్రవాదులు గ్రానెడ్ దాడి చేశారు. కాగా గ్రానెడ్ గురి తప్పడంతో పక్కనే ఉన్న సుమో టాక్సీ స్టాండ్లో  పేలుడు జరిగింది. తాజాగా జరిగిన ఈ దాడిలో 6గురు సాధారణ పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం శ్రీనగర్ లోని ఆసుపత్రికి తరలించారు. మిగతా వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.