నెల్లూరు జిల్లా, బోగోలు మండలం, చిప్పలేరు మత్స్య రేవు భూ నిర్వాసితుల గొడవ లో కావలి ఎమ్మెల్యే పై ఆరోపణలు వస్తున్నాయి. ఎమ్మెల్యే తీరు కారణంగానే కోట్ల రూపాయలు స్వాహా అయ్యాయని సంబంధిత బాధితులు గగ్గోలు పెడుతూ మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించగా, ప్రస్తుతం అక్కడ విచారణ మొదలయింది. దీనిపై ఎవరు విచారణ చేసినా తాను సిద్ధంగానే ఉన్నానని, ధైర్యంగానే ఎదుర్కొంటానని ఎమ్మెల్యే చెబుతుండడం ఈ కథలో కొసమెరుపు.
అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు రావడంలో కొత్త ఏమీ లేదు కానీ వీటిపై వాళ్లిచ్చే వివరణలే మరీ! తేలిగ్గా ఉంటాయి. అయితే వీటి గురించి కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ వివరణ ఇచ్చారే అనుకుందాం అవి కూడా ఏ మాత్రం వాస్తవాలకు అందవు. అయినా కూడా మాట్లాడుతున్నది అధికార పార్టీ ఎమ్మెల్యే కనుక మనం నోర్మూసుకుని ఉంటే మేలు. ఈ ప్రభుత్వంలో ఏం మాట్లాడాలి అన్నా అంతా జగనన్న చెప్పిన విధంగానే మాట్లాడాలి అన్న విమర్శ ఒకటి విపక్షం నుంచి వినవస్తుంది. ఇదే నిజం అయి ఉంది కూడా! కనుక జగన్ సర్కారులో ఎమ్మెల్యేల అవినీతిపై విచారణ జరిగినా పోయిన సొమ్ములు తిరిగివస్తాయా? అన్యాయం అయిన వారికి బాధిత గొంతుకులకు జగన్ తరఫున హామీ దొరకుతుందా? అన్నవే ఇప్పటి సందేహాలు.
కోర్టు బోనులో జగన్ ఎమ్మెల్యే ఒకరు నిలబడనున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓ వివాదంలో ఇరుక్కున్నారు. మత్స్యకారులకు చెల్లించాల్సిన పరిహారాన్ని ఆయనతో సహా ఆయన అనుచరులు కాజేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనపై హెచ్చార్సీలో కేసు నమోదు అయింది. మత్స్యకారులకు చెల్లించాల్సిన 2.6కోట్ల రూపాయలను ఆయన పక్కదోవ పట్టించారని ఆరోపిస్తూ మత్స్యకారుల పరిరక్షణ సమితి హెచ్చార్సీని ఆశ్రయించింది. దీంతో ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మత్స్యకార సంఘాలు పట్టుబడుతున్నాయి. ఎమ్మెల్యే మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చుతున్నారు.