ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ తారాజువ్వాలా దూసుకెళ్తున్నారు. అదే స్పీడుతో ప్రతిపక్షాలను మాటలతో కడిగిపారేస్తున్నారు. ప్రచారంలో భాగంగా నేడు నిర్మల్‌లో ఏర్పాటుచేసిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్లలో ఎన్నో హామీలు అమలు చేశామని, హామీ ఇవ్వనివే వందకుపైగా పథకాలు ప్రజలకు అందించామన్నారు. ప్రస్తుత పరిస్థితులను గమనించి తనను మరో సారి గెలిపించాలని కోరారు. తెరాసకు ఓటేసి గెలిపిస్తే మరో సారి ప్రజలకు సేవ చేసుకుంటా…ఏదైన జరగరానిది జరిగి ఓటమి పాలైతే వ్యవసాయం చేసుకుంటా అన్నారు. నేను పోరాడేది నాకోసం కాదు..తెలంగాణ సమాజంకోసం అంటూ ఆయన వివరించారు. ఒంటరిగా తెరాసతో పోరాడే దమ్ములేని కాంగ్రెస్.. ఆంధ్రా పార్టీ సాయం తీసుకుందన్నారు.
చంద్రబాబు మన నీళ్లను అడ్డుకున్నారు. అలాంటి వారితో కలిసి నేడు మహాకూటమిని ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలు స్వాగతించరు అంటూ పేర్కొన్నారు. ఎంతో తెలివి గల వాళ్లం అనుకునే ఏపీలో కరెంటు సక్కగా లేదు.. మన దగ్గర 24 గంటల పాటు కరెంటు ఉంటుంది అంటూ వివరించారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని, రిజర్వేషన్లు పెంచాలని తీర్మానాన్ని పంపితే ఆమోదించలేదని చెప్పారు. ఎస్టీ, ముస్లింల రిజర్వేషన్ల కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రానికి 30 లేఖలు కూడా రాసినా ప్రయోజనం దక్కలేదన్నారు. కొద్ది రోజుల క్రితం అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ… నిర్మల్‌లో అసదుద్దీన్ ప్రచారం చేయకుండా ఉంటే రూ.25 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆశచూపడం చాలా విడ్డూరం అన్నారు… అయితే 25 కోట్లు ఇచ్చినా అసదుద్దీన్ అలాంటి పనులు చేయరని ఎంఐఎం ఎంపీకీ మద్దతు తెలిపారు. తెలంగాణలో ముస్లిం సోదరులు తెరాసకు అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. మనకి పరాయి పాలన, బానిస బతుకులు వద్దు అంటూ తనదైన శైలిలో కేసీఆర్ మహాకూటమిని విమర్శించారు.