కేసీఆర్ పిరికివాడు : డీకే అరుణ వివాదాస్పద వ్యాఖ్య

-

తెలంగాణలో అవినీతి పాలన కొనసాగుతోందని, బీజేపీ అధికారంలోకి వస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని అందుకు నిదర్శనం.. ఇటీవల జరిగిన దుబ్బాక, హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలేనని చెప్పుకొచ్చారు. సీఎం కేసీఆర్ పిరికివాడని, తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల శ్రమను దోచుకుని తెలంగాణను గుప్పెట్లో పెట్టుకున్నారని ఆమె విమర్శించారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కేవలం సీఎం కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. ఒకే ఇంట్లో మంత్రులు, ఎమ్మెల్సీ పోస్టులు ఉన్నాయని, మంత్రి వర్గంలో అతి ముఖ్యమైన శాఖలను ఆ కుటుంబమే నిర్వర్తిస్తోందన్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయం కుల్వకుంట్ల కుటుంబం చేతిలోనే ఉందని ఆమె మండిపడ్డారు.

dk aruna
dk aruna

పట్టభద్రుల సన్నాహక సమావేశంలో భాగంగా మంగళవారం ఆమె గద్వాల జిల్లాలో పర్యటించారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ప్రజలు మోసపోయారని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యోగులు, పెన్షనర్లు, రైతులు, మహిళలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆమె వాపోయారు. తెలంగాణ ఉద్యమంలో ముందుడి నడిపించిన విద్యార్థులు నిరుద్యోగులుగా మారారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడితే అన్ని సమస్యలు తీరుతాయని చెప్పిన సీఎం కేసీఆర్.. ఉన్న సమస్యల కంటే మరెన్నో సమస్యలను పుట్టించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు కూడా టీఆర్ఎస్ పాలనతో విసుగెత్తారని, అందుకే మార్పును కోరుకుంటున్నారని ఆమె చెప్పారు.

ఇప్పటికే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రజలు బుద్ధి చెప్పారని, మార్చి 14న జరిగే మహబూబ్‌నగర్, హైదరాబాద్, నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి టీఆర్ఎస్‌కు గుణపాఠం చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులను భయానికి గురిచేస్తోందని, బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రశ్నించే గొంతుకగా నిలుస్తామన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ నిరాహార దీక్ష ఉత్తదేనన్నారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం తననేని తెలిపారు. ప్రజలకు ఆశ చూపి మోసం చేశారని, బీజేపీతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. బీజేపీ జాతీయ భావాలు కలిగిన పార్టీ అని.. పట్టభద్రులు తప్పనిసరిగా బీజేపీ అభ్యర్థులను గెలిపించే మార్పుకు నాంది పలకాలని వారు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news