రాజకీయాల్లో వ్యూహాలు పన్నడం, వాటిని సక్సెస్‌ఫుల్‌గా అమలు చేయడంలో తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ని మించినవారు లేరని చెప్పొచ్చు. ఈయన వ్యూహం పన్నారంటే చాలు అది సక్సెస్ కావాల్సిందే. గత కొన్నేళ్ళ నుంచి తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వ్యూహాలకు తిరుగులేదనే చెప్పొచ్చు. అందుకే అక్కడ ప్రతిపక్షాలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
అయితే ఇప్పుడుప్పుడే తెలంగాణలో ప్రతిపక్షాలు పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌లు కేసీఆర్‌పై ఎటాక్ చేయడం మొదలుపెట్టాయి. ఎక్కడకక్కడ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక కేసీఆర్ పని అయిపోయిందని, బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు బాగా హడావిడి చేస్తున్నారని చెప్పొచ్చు.
అటు ఈటల రాజేందర్‌ని చేర్చుకుని బీజేపీ, హుజూరాబాద్‌లో తమదే పైచేయి అంటున్నారు. ఇక పీసీసీ పీఠం దక్కాక రేవంత్ రెడ్డి దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. కేసీఆర్ దగ్గర నుంచి అధికారాన్ని గుంజుకుంటామని మాట్లాడుతున్నారు. అయితే ఇలా బీజేపీ, కాంగ్రెస్‌లు హడావిడి చేస్తుంటే, కేసీఆర్ మాత్రం తన పదునైన వ్యూహాలతో సైలెంట్‌గా పనిచేసుకుంటూ వెళుతున్నారు. మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపారు. ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులని తమవైపుకు తిప్పుకుంటున్నారు. కింది స్థాయి నాయకులని సైతం టీఆర్ఎస్‌లోకి తీసుకొస్తున్నారు.
అటు ఏకంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణనే టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నారుగానీ, రమణకు ఆఫర్ ఇచ్చి పార్టీలో చేర్చుకునే కార్యక్రమం చేయలేదు. రమణ రాకతో హుజూరాబాద్‌లో టీఆర్ఎస్‌కు కాస్త బలం వస్తుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో హుజూరాబాద్ కాంగ్రెస్ లీడర్ కౌశిక్ రెడ్డిని కూడా రాజకీయంగా వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కౌశిక్ రెడ్డి, మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. తాజాగా హుజూరాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అంటే కాంగ్రెస్‌లో ఉంచే కౌశిక్‌ని తమకు అనుకూలంగా టీఆర్ఎస్ వాడుకుంటుందనే వాదన ఉంది. మొత్తానికైతే కేసీఆర్ సైలెంట్‌గా బీజేపీ, కాంగ్రెస్‌లకు షాక్ ఇచ్చేలా ఉన్నారు.