తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని పరిణామం తెలంగాణలో చోటు చేసుకుంది. కీలకమైన దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికను ఏకపక్షం చేసుకుందామని, సింపతీతోపాటు.. తన పాలన మెరుపులను కూడా జోడించి ఇక్కడ విజయం సాధించాలని ఆయన వేసుకున్న పక్కావ్యూహం.. పూర్తిగా బెడిసి కొట్టింది. ఎన్నికలకు ముందు.. అనేక విధాలుగా ధీమా వ్యక్తీకరించిన కేసీఆర్.. ఫలితాల అనంతరం.. గెలుపునకు తాము పొంగిపోమని.. ఓటమికి తాము కుంగిపోమని తన కుమారుడు, మంత్రి కేటీఆర్‌తో పలికించినా.. లోలోన మాత్రం ఓటమిపై అంతర్మథనం మాత్రం చేస్తున్నారు.
అతిగా ఊహించుకోవడం.. తాము తప్ప తెలంగాణకు మరో దిక్కులేదని ప్రచారం చేసుకోవడం, తాము చెప్పిందే వేదం .. అన్నట్టుగా వ్యవహరించడం టీఆర్ ఎస్‌కు ఎదురైన ప్రధాన అవరోధాలుగా ప్రజలు చెబుతున్నారు. ఇదే విషయం.. దుబ్బాక ఉప పోరులో ప్రతిఫలించి.. ఓట్లు తగ్గిపోయాయి. సోలిపేట రామలింగారెడ్డి మరణం ద్వారా దఖలు పడాల్సిన సింపతీ ఓట్లు కూడా తగ్గిపోయి.. ఆఖరుకు ఓటమి బాటపట్టాల్సి వచ్చింది. ఇది అసాధారణ ఓటమి..! లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమన్న టీఆర్ ఎస్ చివరకు స్వల్ప తేడాతో ఓటమి బాటపట్టింది.
కరోనా విషయంలో మితిమీరిన అలసత్వం, మరణాలను కేసులను దాచిన ఫలితంతో మధ్య తరగతి వర్గం టీఆర్ ఎస్‌కు దూరమైంది. రైతులు, సాధారణ ప్రజల వెతలు పట్టించుకోకుండా.. పైపై మెరుగులకు ప్రాదాన్యం ఇవ్వడం ఆయా వర్గాలను కూడా పార్టీకి దూరం చేసింది. అదే సమయంలో తమపై వ్యతిరేకత కేవలం పార్టీలు పుట్టించిందే తప్ప.. ప్రజల నుంచి వచ్చింది కాదన్న కేసీఆర్.. ఇప్పుడు సమాధానం చెప్పలేని పరిస్థితి..! ఇక, త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి. వీటిలో కూడా కేసీఆర్ దూకుడు రాటుదేలే పరిస్థితి కనిపించడం లేదు.
చిన్నపాటి వర్షానికే నగరం మునిగిపోవడం, రహదారుల విస్తరణ చేస్తామని ఆగిపోవడం, అవి నీతి.. ఇలాసర్వవిధ భ్రష్టత్వంతో కేసీఆర్ ప్రభుత్వం వేస్తున్నఅడుగులుఓటమి తీరానికే చేర్చుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో కుటుంబ పాలన కూడా ఆయన పై విముఖతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇదే వాతావరణం కొనసాగితే.. వచ్చే 2023 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు.