29న పెద్దపల్లిలో లక్ష మందితో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రకటించారు. తాజాగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ తో కలిసి ఆగస్టు 29న సీఎం సభ నిర్వహణ కోసం అనువైన స్థలాలను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం కేసీఆర్ నూతన జిల్లాలు ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ అభివృద్ధి పనుల ఫలితాలు ప్రజల వద్దకు అందుతున్నాయని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు పూర్తవుతున్నాయని, వాటిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభిస్తున్నారని మంత్రి తెలిపారు. పెద్దపెల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ నిర్మాణ భవనాన్ని ఆగస్టు 29న, జగిత్యాల జిల్లాలో కలెక్టరేట్ భవనాన్ని సెప్టెంబర్ 10న స్వయంగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నూతన సమీకృత కలెక్టరేట్ ఎదురుగా పెద్దకల్వల శివారులోని అనువైన స్థలంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, గత 8 సంవత్సరాలుగా ప్రజలకు అందిస్తున్న వివిధ కార్యక్రమాల గురించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యటన, భారీ బహిరంగ సభ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని మంత్రి అధికారులకు సూచించారు. సభ వద్ద వచ్చే ప్రజలు, ప్రజా ప్రతినిధుల కోసం అవసరమైన మేర పార్కింగ్ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతంలో భద్రత పకడ్బందీగా ఉండే విధంగా , ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.