ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో దళితబందు పథకం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఒక్కో మాట అంటున్నాయి. ఇదిలా ఉంటే, అటు దళితబంధు ( Dailth Bandhu Scheme ) పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. పాటల ద్వారా జనాల నోళ్ళలో దళిత బంధు నానడానికి రచయితలతో సమావేశం అయ్యారు. ప్రముఖ రచయిత ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్, దేశపతి శ్రీనివాస్, అభినయ శ్రీనివాస్ మొదలగు రచయితలతో సమావేశమై దళితబంధు పాటలపై చర్చలు జరుపుతున్నారు.
‘దళితవాడ ప్రగతి జాడ నడిపించగ వచ్చెనో.. ముఖ్యమంత్రి కేసీయారు… దళితబంధు పథకముతో ఆత్మబంధువయ్యెనో.. ముఖ్యమంత్రి కేసీయారు.. అంటూ కొనసాగేలా పాటలు ఉండనున్నాయి. ఈ పాటలని ఆగస్టు 16వ తేదీన విడుదల చేస్తారని సమాచారం.
కేసీఆర్ సాహిత్య పిపాస
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎంత సాహిత్య పిపాసకులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలాసార్లు చాలా సమావేశాల్లో ఆయన పాండిత్య ప్రకర్ష గోచరమవుతూ ఉంటుంది. ఆశువుగా చెప్పే సామెతలు, జాతీయాలు వినసొంపుగా ఉండడమే కాదు, ఆసక్తిగా ఉంటుంది. చాలా సామెతలు కేసీఆర్ నోటి నుండి వచ్చిన తర్వాతే జనబాహుళ్యంలో విపరీతమైన ప్రజాదరణ పొందాయంటే అతిశయోక్తి కాదు. అందులో కొన్నింటిని చూసుకుంటే పొట్టోణ్ణి పొడుగోడు కొడితే పొడుగోడ్ని పోశమ్మ కొట్టిందట వంటివి కనిపిస్తాయి.
తెలుగు సాహిత్యంలో ఎంఏ చేసిన కేసీఆర్ గారికి తెలుగంటే అభిమానం ఎక్కువ. సాహిత్యం ద్వారా ప్రజల్లో చైతన్యం రగిలించవచ్చని, తెలంగాణ ఉద్యమ కాలంలో ఎన్నో రచనలు చేసారు. జై బోలో తెలంగాణ సినిమాలో గారడి చేస్తున్రు, గడిబిడి చేస్తున్రు.. లొల్లికి దిగుతున్రు అనే పాట స్వయంగా కేసీఆర్ గారే రాసారు. ఆ పాట ఎంత పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఇవే కాదు ధూంధాం కార్యక్రమంలో పాడే చాలా పాటలను కేసీఆర్ రచించారు.
ఉద్యమకాలం తర్వాత మళ్ళీ మరోమారు కేసీఆర్ కలం పట్టారు. దళితబంధు మీద వస్తున్న ఈ పాటలు ఎలా ఉండనున్నాయోనన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.