వచ్చే నెల 7 లోపు తెలంగాణలో కరోనా ఉండదు : కేసీఆర్‌

-

కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు తెలంగాణాలో కరోనా కేసులు 70 వరకు కేసులు నమోదు అయ్యాయని ఆయన వివరించారు. వారిలో 11 మందికి కరోనా వైరస్ పూర్తిగా నయం అయిందని వివరించారు. డిశ్చార్జ్ అయిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ తో కూడా మాట్లాడి గాంధీ ఆస్పత్రిలో చాలా బాగా చూసుకుంటున్నారని వివరించారు.

ఎవరి ఆరోగ్యం కూడా విషమంగా లేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 27 వేల మందికి పైగా క్వారంటైన్ లో ఉన్నారని , ఆస్పత్రిలో 58 మందికి చికిత్స అందిస్తున్నారని అన్నారు. క్వారంటైన్ లో ఉన్న వారు అందరూ బయటకు రావడానికి సమయం దగ్గర పడిందని, రేపు 11 మంది కరోనా బాధితులను డిశ్చార్జ్ చేస్తున్నారని చెప్పారు. క్వారంటైన్ లో ఉన్న వాళ్ళను వచ్చే నెల 7 లోపు డిశ్చార్జ్ చేస్తున్నామని తెలిపారు. 7వ తేదీలోపు మొత్తం రాష్ట్రంలో కరోనా ఉండదని దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

కొత్తవి వచ్చే అవకాశాలు దాదాపుగా లేవని అన్నారు. అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలను మూసి వేశామని అన్నారు. రాష్ట్రంలో 25,937 మంది క్వారంటైన్ లో ఉన్నారని అన్నారు. వారిని 5,746 టీం లు పర్యవేక్షిస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో కరోనా వైరస్ కి మందు లేదని ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితం కావాలని అది ఒక్కటి మినహా మరో మార్గం లేదని కెసిఆర్ అన్నారు.

కరోనా వైరస్ చాలా ప్రమాదకర వైరస్ అని కెసిఆర్ అన్నారు. సూది మొన మీద ఎన్నో వైరస్ లు ఉంటాయని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ప్రజలు అందరూ కూడా ఈ గండం నుంచి బయట పడే వరకు ప్రజలు అందరూ లాక్ డౌన్ ని పాటించాలని కెసిఆర్ అన్నారు. భారత్ లో ఇప్పుడు కరోనా చాలా వరకు అదుపులో ఉందని అన్నారు. ప్రపంచ దేశాలు కూడా దీన్ని మెచ్చుకునే పరిస్థితి ఉందన్నారు.

స్వీయ నియంత్రణ వలన కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చు అని కెసిఆర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రతీ గింజా కూడా ప్రభుత్వమే కనీస మద్దతు ధర ఇచ్చి కొంటుంది అని స్పష్టం చేసారు. రైతులు ఎవరూ కూడా భయపడవద్దని సూచించారు. ప్రతీ కేజీ ప్రభుత్వమే కొంటుంది కాబట్టి రైతులు అనవసరంగా మార్కెట్ కి వెళ్ళవద్దు అని ఆయన కోరారు. ప్రభుత్వమే గ్రామాలకు వచ్చి కొంటుందని పేర్కొన్నారు.

రైతులకు ముందు కూపన్లు ఇచ్చి కొనుగోలు చేస్తామని సూచించారు. మార్కెట్ యార్డులు అన్నీ కూడా మూసి వేశామని, గ్రామాల్లోనే కొనుగోళ్ళు ఉంటాయని వ్యాఖ్యానించారు. రైతులకు ఆన్లైన్ లోనే చెల్లిస్తామని పేర్కొన్నారు. కోటి 5 లక్షల టన్నుల వరి వచ్చే అవకాశం ఉందన్నారు. 14 లక్షల టన్నులకు పైగా మొక్క జొన్న వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. రైతులు ఎవరూ కూడా ధాన్యాన్ని మార్కెట్ కి తీసుకురావోద్దని చెప్పారు.

కొనుగోలు కేంద్రాల సంఖ్యను పెంచామని వ్యాఖ్యానించారు. బయట కనీస ధర కూడా రావడం లేదు చాలా తక్కువగా వస్తుందన్నారు. గ్రామాల్లో కరోనా నియంత్రణ లో ఉందని చెప్పుకొచ్చారు. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 40 లక్షల ఎకరాల్లో వరి పంట పండుతుందని చెప్పారు. రైతులు అనవసరంగా కంగారు పడి ఒకరి మీద ఒకరు పడవద్దన్నారు. గ్రామాల్లో కరోనా కంట్రోల్ ఉంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉందన్న కెసిఆర్… రెవెన్యు భారీగా పడిపోయిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, అయినా సరే వడ్లు కొనడానికి 25 వేల కోట్లు సమకూర్చామన్నారు. గ్రామాల్లో చాలా మంది ముళ్ళ కంచెలు వేశారన్నారు. అవి తీస్తే మినహా రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేదని, కాబట్టి ముళ్ళ కంచే వద్ద ఒక గంగాళం పెట్టి కాళ్ళు చేతులు పెట్టి సబ్బులు పెడితే చేతులు కడుక్కుని వస్తారన్నారు.

రైతులు ఎవరూ కంగారు పడవద్దని, రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేయడం ఖాయమని కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. గత్తర పడితే మాత్రం ఇబ్బంది పడటం ఖాయమని మూడు అడుగుల దూరం పాటించిన తర్వాతే కొనుగోలు చెయ్యాలన్నారు. అందరూ కూడా ప్రభుత్వాలకు సహకరించాలని, ప్రజలు అందరూ కూడా నిమ్మ, దానిమ్మ, పంటలను బయటకు అమ్మ వద్దని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news