తక్షణమే రైతుల పరిహారంపై చర్యలు చేపట్టండి: సీఎం కేసీఆర్‌

-

రాష్ట్రంలో అకాల వర్షాలకు, వడగండ్ల వానలకు పంట నష్టపోయిన రైతులకు అందించే పరిహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రైతులకు పరిహారాన్ని అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు. ప్రధానంగా వర్షాల వల్ల జరిగిన పంటనష్టం, పోడు భూములు, గొర్రెల పంపకం, పేదల ఇళ్ల నిర్మాణానికి ఆర్థికసాయం తదితర అంశాలపై సీఎం సమీక్ష చేశారు.

ఎకరాకు రూ.10వేల చొప్పున పంట నష్ట పరిహారం రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. దానిని తక్షణమే అమలు చేయాలని సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. పంట నష్టానికి సంబంధించి ఆయా జిల్లా కలెక్టర్లు జిల్లాల పరిధిలో, క్లస్టర్ల వారీగా స్థానిక వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి వివరాలను ప్రభుత్వానికి అందజేయాలని సీఎం ఆదేశించారు.

మరోవైపు రాష్ట్రంలో పోడు భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న సీఎం.. అర్హులైన వారికి పోడు పట్టాల పంపిణీకి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలన్నారు. నాలుగు లక్షల ఎకరాలకు సంబంధించి  1.55 లక్షల  మంది అర్హులకు పోడు పట్టాలు అందించేందుకు పాస్  బుక్‌లు ముద్రించి సిద్ధంగా ఉంచినట్లు అధికారులు సీఎంకు వివరించారు. పోడు భూముల పట్టాల పంపిణీ కోసం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news