హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పబ్లిక్ గార్డెన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అమరవీరుల స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ విమోచనం.. నిజాం చెర నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాట యోధులు చేసిన త్యాగాల గురించి ప్రసంగించారు. 75 ఏళ్లలో హైదరాబాద్ ప్రాంతం, ఎనిమిదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి గురించి మాట్లాడారు.
“ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ నేడు అనేక రంగాల్లో ముందుంది. తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయికంటే ముందుంది. ప్రభుత్వ కృషి వల్ల జలవనరులు, పంటల దిగుబడి పెరిగింది. దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా నేడు తెలంగాణ ఎదిగింది. వైద్య, ఆరోగ్య రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో ప్రశాంతమైన పారిశ్రామిక వాతావరణం ఉంది. ప్రశాంతమైన వాతావరణం వల్లే రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఐటీ రంగ వృద్ధిరేటులో జాతీయ స్థాయికంటే ముందున్నాం. ఐటీ రంగం ఉత్పత్తిలో ఇటీవలే బెంగళూరును అధిగమించాం.” అని కేసీఆర్ అన్నారు.