ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారని ఆరోపించారు. ప్రధాని మోదీ తన జీవితకాలంలో ఢిల్లీలో ఆప్‌ని ఓడించలేరని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. ఇటీవల మద్యం కుంభకోణం కేసులో ఆ పార్టీ నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించిన క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఢిల్లీలో మద్యం కుంభకోణంలో ఏం జరిగింది.. కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు కోరింది కానీ సీబీఐ, ఈడీ ఎలాంటి ఆధారాలు ఇవ్వలేకపోయాయి. సంజయ్ సింగ్, సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియాలను ఫేక్ కేసులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారు.. మమ్మల్నందరినీ జైల్లో పెట్టి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకుంటున్నారు.
అలా ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఢిల్లీలో మమ్మల్ని ఓడించలేరని ఆయనకు తెలుసు. మమ్మల్ని జైలుకు పంపండి. ఆప్ జైల్లోంచి గెలుస్తుంది. మీ జీవితకాలంలో ఢిల్లీలో ఆప్‌ని ఓడించలేరని నరేంద్ర మోదీకి చెప్పాలనుకుంటున్నాను. మాపై గెలవాలంటే మీరు మరో జన్మ ఎత్తాల్సి ఉంటుంది” అని కేజ్రీవాల్.. అక్కడి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
భగత్‌సింగ్ దేశం కోసం సంవత్సరాల తరబడిలో జైలులో ఉన్నారు. మనీష్ సిసోడియా ఎనిమిది నెలలుగా, సత్యేందర్ జైన్ ఏడాదిగా జైలులోనే ఉన్నారు. అలాంటప్పుడు నేను మాత్రం అరెస్ట్‌కు ఎందుకు భయపడాలి ?’’ అని ఢిల్లీ సీఎం తెలిపారు. ఆప్ కీలక నాయకులు బయట ఉంటే ఢిల్లీలో గెలవడం అసాధ్యమని గ్రహించబట్టే.. లిక్కర్ స్కాం పేరుతో కేంద్ర సర్కారు అక్రమ అరెస్టులు చేస్తోందని ఆరోపించారు. ‘‘మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లు బీజేపీలో చేరితే 24 గంటల్లో బెయిల్ వస్తుంది. మమతా బెనర్జీ, తేజస్వీ యాదవ్, హేమంత్ సోరెన్ వంటి నాయకులను కూడా అరెస్టు చేయాలని వాళ్లు ప్లాన్ చేస్తున్నారు’’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.