దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మద్యం ప్రియులకు మద్యం లభించడం లేదు. సరే.. వారానికో, నెలకో ఒకటి, రెండు సార్లు మద్యం తాగేవారు.. నోళ్లు కట్టుకుని కూర్చున్నారు కానీ.. నిత్యం మద్యం సేవించే వారికి మాత్రం ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఇప్పటికే ఆరేడు రోజులుగా మద్యం లభించడం లేదు. దీంతో నిత్యం మద్యం తాగేవారి నాలుకలు పీక్కుపోతున్నాయి. గుక్కెడు మద్యం దొరికితే బాగుండును.. అని వారు అనుకుంటున్నారు. ఇక ఇలాంటి వారిలో కొందరైతే మద్యం లభించక వింత వింతగా ప్రవర్తిస్తున్నారు.
కేరళలో మద్యం లభించని కారణంగా ఇప్పటి వరకు 9 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొందరు మద్యం లభించదేమోనని సూసైడ్ చేసుకుంటే.. కొందరు ఆల్కహాలిక్ విత్‌డ్రాయల్ సింప్టమ్స్ బారిన పడి గుండె పోటు, ఫిట్స్‌తో చనిపోయారు. ఇక 25 మందిని ఆ రాష్ట్రంలోని డీ అడిక్షన్ సెంటర్లకు తరలించారు. అయితే ఇలాంటి బాధితులు రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో వీరి సమస్యలను పరిష్కరించడం కేరళ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.
అయితే మద్యం ఒక్కసారిగా మానేస్తే కలిగే ఇబ్బందుల వల్లే మద్యం ప్రియులు కొందరు చనిపోతున్నారని.. తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారని.. తెలుస్తున్నందున.. అలాంటి వారికి మద్యాన్ని కొద్ది కొద్దిగా అందజేయాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ అక్కడి మానసికవేత్తలు, వైద్య నిపుణులతో ఇప్పటికే మాట్లాడారట. మద్యానికి బానిసలైన వారికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మద్యాన్ని కొద్ది కొద్దిగా విక్రయించాలని చూస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి కేరళ ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ఏది ఏమైనా.. నిత్యం పీకలదాకా మద్యం సేవించే మందు బాబులకు నిజంగా ఇప్పుడు చాలా పెద్ద కష్టమే వచ్చింది. మరి కేరళతో సహా మిగిలిన రాష్ట్రాలూ.. ఈ విషయం పట్ల ఏం చేస్తాయో చూడాలి..!