ఏపీ రాజధాని అమరావతి వికేంద్రీకరణ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ ప్రజాప్రతినిధులు అయిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాజీనామా డ్రామాలు ఆడించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రమే రాజీనామా చేయడం కాదని.. సీఎం జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళదామని.. ఎన్నికల్లో జగన్ విజయం సాధిస్తే రాజధాని మార్పుపై ప్రజలకు ఇష్టం ఉన్నట్టు తాను అంగీకరిస్తానని చెప్పారు. 151 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుని భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ అసెంబ్లీని రద్దు చేయాలని చంద్రబాబు సవాల్ చేయడంతో పాటు 48 గంటల పాటు డెడ్‌లైన్ పెట్టడం పెద్ద కామెడీగా మారింది.
ఇదిలా ఉంటే 48 గంటల డెడ్‌లైన్ తర్వాత చంద్రబాబు తమ పార్టీ కీలక నేతలను పిలిచి పెద్ద తతంగమే చేశాడట. గుంటూరు, విజయవాడ పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆదేశించారట. గుంటూరు వెస్ట్ మద్దాలి గిరి ఎలాగూ పార్టీకి దూరమయ్యాడు. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌లను రాజీనామా చేయాలని సూచించారట చంద్రబాబు. జయదేవ్ వెంటనే సీఆర్డీయే పరిధి నా నియోజకవర్గం కంటే ఎక్కువుగా విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్నందున కేశినేని నానితో చేయిస్తే బాగుంటుందని సూచించి.. ఆయన ఎస్కేప్ అయ్యారట.
చివరకు చంద్రబాబు కేశినేని నానిని నమ్ముకున్నారట. కేశినేనితో ఈ విషయం చెపితే రాజీనామా చేస్తే మీతో పాటు అందరం చేద్దాం లేకపోతే వద్దు అన్నారట. దీంతో చంద్రబాబు మైండ్ బ్లాక్ అయిపోయిందట. అయినా చంద్రబాబు ఒత్తిడి చేసే ప్రయత్నం చేయగా.. లోకేష్‌ను ముందుగా మండలికి రాజీనామా చేయించండి.. ఎంపీగా రెండోసారి గెలిచిన నేను ఎందుక రాజీనామా చేస్తానని చెప్పాడట. ఇక విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైతం తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేనిన చెప్పేశారట. ఇప్పుడు ఈ విషయం టీడీపీ వర్గాల్లో బాగా హల్‌చల్ చేస్తోంది.