ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేస్ ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు మరికొంత మంది తన మరణానికి కారణం అంటూ సెల్ఫీ వీడియోలో సాయిగణేష్ వెల్లడించారు. మంత్రితో పాటు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సాయిగణేష్ వెల్లడించారు. ఈ ఆత్మహత్య అంశం బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య ఉద్రిక్తతలకు దారి తీసింది. స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా సాయి గణేష్ కుటుంబంతో ఫోల్ లో మాట్లాడి.. కుటుంబాన్ని పరామర్శించారు.
తాజాగా ఆ ఆత్మహత్యపై హైకోర్ట్ లో పిల్ దాఖలు అయింది. సాయిగణేష్ ఆత్మహత్యపై సిబీఐ విచారణ జరపాలంటూ పిల్ దాఖలు అయింది. ఈ రోజు( శుక్రవారం) మధ్యాహ్నం ఈ పిల్ పై హైకోర్ట్ విచారణ జరపనుంది. ఇప్పటికే గవర్నర్ తమిళిసై ఈ ఘటనపై ప్రభుత్వం నుంచి నివేదిక కోరారు. దీంతో పాటు భువనగిరి పరువు హత్య, సూర్యాపేట జిల్లాలో సామూహిక అత్యాచార ఘనటపై, కామారెడ్డిలో తల్లికుమారుల ఆత్మహత్యపై కూడా పూర్తి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే బీజేపీ నేతలు రాష్ట్రంలో ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. మంత్రి పువ్వాడ అజయ్ బర్త్ రఫ్ చేయాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.