ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇవాళ దిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతో పాటు మరికొందరు ఇతర రాష్ట్రాల ప్రజాప్రతినిధులు హైదరాబాద్కు రానున్నారు. ఈరోజు రాత్రి వారు ఇక్కడే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు.
అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రికి వెళ్తారు. అక్కడ లక్ష్మీనరసింహస్వామిని దర్శనం చేసుకొని హెలికాప్టర్లలో ఖమ్మం వెళ్తారు. అక్కడ కంటివెలుగు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు బహిరంగసభ జరగనుంది. సభలో ముఖ్య అతిథుల తర్వాత చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారు.
సభ ముగింపు సమయంలో తెలంగాణ సంప్రదాయాలు ప్రతిబింబించేలా పోచంపల్లి, నారాయణపేట శాలువాలతో అతిథులను కేసీఆర్ సత్కరిస్తారు. కరీంనగర్ కళాకారులు రూపొందించిన సిల్వర్ ఫిలిగ్రి వీణలను జ్ఞాపికలుగా అందజేస్తారు. ఒక్కో జ్ఞాపిక తయారీకి కిలోన్నర వరకు వెండిని ఉపయోగించినట్లు సిల్వర్ ఫిలిగ్రి సొసైటీ నిర్వాహకులు తెలిపారు. అయిదు జ్ఞాపికలను సిద్ధం చేసినట్లు చెప్పారు. సభ ముగిసిన తర్వాత భారీగా బాణసంచా కాల్చేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.