ఒత్తిడిగా ఫీల్‌ అయితే పిల్లలు జంక్‌ఫుడ్ తినాలనుకుంటారట..!

-

ఈ జనరేషన్ పిల్లలు చిన్నతనంలోనే ఎక్కువగా జంక్ ఫుడ్‌కి అలవాటు పడుతున్నారు. ఇలా పళ్లు వచ్చాయో లేదో.. అలా కిండర్ జాయ్, చిప్స్, కేకులు, బర్గర్, పీజ్జా, చాట్ ఇలాంటివన్నీ లాగించేస్తున్నారు. చిన్నవయస్సులో అలవాటైన ఇవి క్రమంగా పెరుగుతున్న కొద్ది వారి జీవితంలో భాగమైపోతున్నాయి. కొందరు ఒత్తిడికి గురైతే వారికి అసలు ముద్ద దిగదు. మరికొందరేమో ఒత్తిడితోనే ఎక్కువగా తినేస్తారు. పిల్లలు ఈ రెండో కోవకు చెందుతారు. వారు ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా జంక్ ఫుడ్ తినాలనుకుంటారట. ఈ విషయాన్ని పిల్లల మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు ఒత్తిడికి జంక్‌ఫుడ్‌కి సంబంధమేంటనుకుంటున్నారా.. ఒత్తిడికి-ఒత్తిడిలో వారు తీసుకునే ఆహారానికి అవినాభావ సంబంధం ఉందంటున్నారు మానసిక నిపుణులు. అసలు దీని కథాకమామీషు ఏంటో చూద్దామా..?

 

 

ఒత్తిడిలో శరీరం ప్రతిస్పందిస్తుందని.. ఈ క్రమంలో పిండి పదార్థాలను తినాలనే సంకేతాన్ని మెదడు పంపిస్తుందని మానసిక నిపుణులు అంటున్నారు. అందుకే చిప్స్, కేకులు, తీపిపదార్థాలు తింటూ ఉంటారు. అసలు పిల్లలకు ఒత్తిడి ఏంటి అనుకుంటున్నారేమో.. వాళ్లకీ టెన్షన్స్ ఉంటాయండీ.

‘మీ ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోవడమో.. అంటే ఇంట్లో తల్లిదండ్రులు గొడవ పడుతుంటే పిల్లలకు మనసున పట్టదు. ఇంకా చదువు ఒత్తిడి. ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువగా టెన్షన్ పెట్టుకుంటోంది దీనికోసమే. ర్యాంకులు రాకపోతే బతకడమే వేస్ట్ అన్న పంథాలో పిల్లల్ని పెంచుతున్నారు తల్లిదండ్రులు. వారి అంచనాలు అందుకోలేని పిల్లలు ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడి తట్టుకోలేని వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.’ అని పిల్లల మానసిక నిపుణులు చెబుతున్నారు.

 కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు అల్పాహారంగా చిప్స్‌, బిస్కట్లు, చాక్‌లెట్లు వంటి వాటిని పెడుతున్నారు. భారతీయ ఆహారాల్లో ఇడ్లీ ఆరోగ్యకరమైన అల్పాహారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. ఇలాంటి వాటిని వదిలేసి నూడుల్స్‌, గార్లిక్‌ బ్రెడ్‌ వంటివాటి వెంట పరుగులు పెడుతున్నాం. పైగా  పిల్లలు వద్దని మారాం చేసినా తల్లిదండ్రులు కుక్కి కుక్కి పెడుతుంటారు. నిజానికిదో విష సంస్కృతి.

పిల్లలు చిరుతిళ్లు తినడానికి మొగ్గుచూపుతున్నారంటే వారు ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. వారు ఒత్తిడి నుంచి బయటపడేందుకు హెల్ప్ చేయాలి. అంటే ముందు మీరు ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించుకోవాలి. మిమ్మల్ని చూసి వాళ్లు ప్రోత్సాహం పొందుతారు. పొద్దున లేచి తల్లిదండ్రులు నడిస్తే పిల్లలు కూడా అనుసరిస్తారు. నడక, పరుగు, యోగా, ధ్యానం, ప్రాణాయామం, ఈత, ఆటలు తదితర రూపాల్లో శారీరక శ్రమ చేయడం వల్ల సానుకూల మానసిక స్థితి ఏర్పడుతుంది. దీంతో పిల్లలకు జంక్‌ ఫుడ్‌ తినాలనే ఆలోచన తగ్గుతుంది.

పిల్లలను పాఠశాలలో చేర్చేటప్పుడు కూడా కేవలం చదువుపై ఫోకస్ చేసే స్కూళ్లలో కాకుండా ఎక్స్‌ట్రా కరిక్యులర్ ఆక్టివిటీస్‌కి చదువుతో సమప్రాధాన్యమిచ్చే పాఠశాలల్లో చేర్పించండి. పిల్లలు జంక్‌ఫుడ్, స్వీట్లు చిన్నతనం నుంచే ఎక్కువగా తీసుకుంటే.. చిన్నవయస్సులోనే ఊబకాయం బారిన పడే అవకాశాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఊబకాయం వల్ల పిల్లల్లో ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. ప్రతికూల ఆలోచనలు పెరిగి.. మానసికంగా, శారీరకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే పిల్లలకు చిన్నతనం నుంచే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా అలవాటు చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news